ఇంటర్‌.. ఇక కొత్తగా | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌.. ఇక కొత్తగా

Jul 3 2025 7:20 AM | Updated on Jul 3 2025 7:20 AM

ఇంటర్‌.. ఇక కొత్తగా

ఇంటర్‌.. ఇక కొత్తగా

● సర్కారు కళాశాలల దిద్దుబాటు ● ప్రతీ తరగతి గదిలో సీసీ కెమెరా ● కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం ● బోధన, విద్యార్థుల అభ్యసనపై పర్యవేక్షణ

మంచిర్యాలఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యా నాణ్యత, మౌలిక సౌకర్యాల కల్పన, విద్యార్థుల హాజరు, బోధనా పద్ధతుల పర్యవేక్షణ కోసం సమగ్ర చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాల ఏర్పాటు, ఫేషియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌ వంటి చర్యలతో సంస్కరణలు ఊపందుకున్నాయి.

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనా పద్ధతులు, లెక్చరర్ల సమయపాలన, విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల్లో ప్రతీ తరగతి గది, ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గదిలో ఒక్కో సీసీ కెమెరా బిగిస్తున్నారు. జిల్లాకు మొత్తం 175కి పైగా కెమెరాలు అందగా, మంచిర్యాల కళాశాలలో 22, లక్సెట్టిపేటలో 15 కెమెరాలు అమర్చనున్నారు. ఈ కెమెరాలను నాంపల్లి లోని ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానిస్తారు. హైదరాబాద్‌ నుంచి అధికారులు, నిపుణులు బోధనా తీరును పరిశీలించి, లోపాలను సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు అందిస్తారు. లెక్చరర్ల సెలవులు, టైంటేబుల్‌ అమలు వంటి అంశాలను కూడా ఈ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తారు.

ఫేషియల్‌ రికగ్నేషన్‌...

విద్యార్థుల గైర్హాజరు సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫేషియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేయనున్నారు. ప్రతీ గ్రూపునకు ఒక లెక్చరర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఇన్‌చార్జిగా ఉంటారు. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తారు. వారం రోజులకు మించి గైర్హాజరైతే లెక్చరర్‌, ప్రిన్సిపాల్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం విద్యార్థులు కళాశాలకు హాజరయ్యేలా చేయడంతోపాటు డుమ్మాలకు చెక్‌ పెడుతుంది.

మౌలిక సౌకర్యాల కల్పన..

ఏళ్ల తరబడి నిధుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.40 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 10 కళాశాలల్లో దండేపల్లి మినహా తొమ్మిది కళాశాలల్లో విద్యుత్‌, తాగునీరు, చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పిస్తారు. కళాశాలల్లో విద్యార్థుల ఇబ్బందులు తొలగిస్తారు.

పెరుగుతున్న ప్రవేశాలు..

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన, మెరుగైన సౌకర్యాలు, విస్తృత ప్రచారం వంటి కారణాలతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గుతున్నారు. జిల్లాలో జనరల్‌, వొకేషనల్‌ కలిపి 1,461 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. లక్షెట్టిపేటలోని ఆధునిక కళాశాలలో అత్యధికంగా 290 మంది, మంచిర్యాలలో 275 మంది చేరగా, సౌకర్యాలు తక్కువగా ఉన్న దండేపల్లిలో 49 మంది ప్రవేశించారు.

కళాశాల వారీగా మంజూరైన నిధులు..

కళాశాలపేరు నిధులు(రూ.లక్షల్లో)

మంచిర్యాల 16.05

మందమర్రి 16.65

కాసిపేట 16.22

చెన్నూరు 21.9

బెల్లంపల్లి బాలికల 16.65

బెల్లంపల్లి 5.6

జైపూర్‌ 20.81

జన్నారం 16.22

లక్సెట్టిపేట 10.85

సంస్కరణలతోపాటు సౌకర్యాలు..

ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలతో కళాశాలల్లో విద్యాబోధన మెరుగుపడుతుంది. సౌకర్యాలు సమకూరుతాయి. నిధుల మంజూరుతో సమస్యలు దూరం కానున్నాయి. ప్రతీ తరగతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటుతో బోధనలో పారిదర్శకత పెరుగుతుంది.

– అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement