
అట్టహాసంగా వాలీబాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, సీఐ శశిధర్‌రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గెలుపు, ఓటములను లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో సాధన చేస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. క్రీడల వల్ల చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని, సమాజంలో మంచి పౌరులను తయారు చేయడానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ క్రీడాకారులు బెల్లం శ్రీనివాస్, యాకూబ్, శివ, ఈశ్వరాచారీ, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.