
జ్వరంతో బాలుడి మృతి
● సొంత ఇల్లు లేక రోడ్డుపైనే మృతదేహంతో రోదించిన తల్లి
లక్ష్మణచాంద: జ్వరంతో మృతి చెందిన కొడుకు అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితిలో ఓ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన చింతకింది లక్ష్మణ్–సుప్రియ దంపతులు మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం లక్ష్మణచాందకు వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నారు. గతేడాది ఇద్దరి మధ్య గొడవ జరగగా లక్ష్మణ్ భార్య, పిల్లలను వదిలి నిజామాబాద్‌కు వెళ్లాడు. దీంతో సుప్రియ పిల్లలతో కలిసి లక్ష్మణచాందలోనే ఉంటోంది. కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. నాలుగు రోజుల క్రితం కుమారుడు లక్ష్మీకాంత్ (12)కు జ్వరం రాగా అతడిని మొదట నిర్మల్ ఆస్పత్రిలో చూపించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. సుప్రియ పుట్టెడు దుఃఖంతో శుక్రవారం ఉదయం కొడుకు మృతదేహంతో లక్ష్మణచాందకు వచ్చింది. సుప్రియ ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు ఎవరూ లేక దిక్కుతోచని పరిస్థితిలో దుఃఖించింది. గ్రామస్తులే మరో ఇంటి ఎదుట టెంట్ వేసి మృతదేహాన్ని అక్కడికి తరలించారు. చేతిలో చిల్లిగవ్వ లేని సుప్రియ కుమారుడి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితిలో ఉండగా గ్రామస్తులు కొంతమొత్తాన్ని సేకరించి సుప్రియకు అందించారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని సుప్రియ భర్త లక్ష్మణ్‌కు సమాచారం ఇచ్చారు. లక్ష్మణ్ బంధువులతో లక్ష్మణచాందకు వచ్చి కుమారుడి మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్‌కు తీసుకువెళ్లాడు.