
● బాసర నుంచే దక్షిణ గంగ ప్రారంభం ● నదీ తీరంలో అనేక పుణ్
దక్షిణ భారతావనికి తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న గోదావరినది బాసర గుండా ప్రవహిస్తోంది. సముద్రమట్టానికి 3,018 అడుగుల ఎత్తున గల పర్వత సానువుల్లో సన్నని ధారలా ప్రవహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రియంబకేశ్వర్ వద్ద బ్రహ్మగిరి పర్వతం నుంచి గోదావరి నది ప్రవహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తోంది. నది పరీవాహక ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. నది ఒడ్డున ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. – భైంసా
ఒడ్డునే అనేక ఆలయాలు...
గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో అనేక ఆలయాలు, నగరాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలో నాసిక్, కొద్ది దూరంలోనే షిర్డీ, పక్కనే ఔరంగాబాద్, జాల్న, మరోవైపు మనకు సమీపంలో నాందేడ్‌లోని సచ్‌కండ్ గురుద్వారాలు, గోదావరి నది ఒడ్డునే నిర్మీతమయ్యాయి.
మన ప్రాంతంలో...
స్కందుడు నడియాడిన కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులను కలుపుకుని త్రివేణి సంగమంగా మారి బాసర వైపు గోదావరి ప్రవాహం కనిపిస్తుంది. నది ఒడ్డునే సరస్వతీ అమ్మవారి ఆలయం, లోకేశ్వరం మండలంలో బ్రహ్మేశ్వర ఆలయం, దిలావర్‌పూర్ మండలం సాంగ్వీలో సంగమేశ్వర ఆలయం, ధర్మపురి నరసింహస్వామి ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నది ఒడ్డునే ఉన్నాయి.
సాగునీరందిస్తూ...
మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి హయాంలో పైథాన్ వద్ద జయక్‌వాడీ ప్రాజెక్టు నిర్మించారు. ఇది ఔరంగాబాద్, జాల్న, పర్భని జిల్లాల్లో 2,37,452 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తోంది. మహారాష్ట్రలో సాగయ్యే చెరుకు పంటకు గోదావరి నది నీరే ఆధారం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పర్భనీ, జాల్నా, నాందేడ్ జిల్లాల ప్రజలకు తాగునీటిని అందిస్తూ మన సరిహద్దులో బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసర వైపు ఈ నది ప్రవాహం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణకు పట్టెడు అన్నం పెట్టే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపైనే నిర్మించారు. ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి వరి పంట పండేందుకు ఈ నీరే ప్రధానం. ఇక మిషన్ భగీరథలో భాగంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఈ నది నుంచే తాగునీటిని అందిస్తారు.
ఎంతోమందికి ఉపాధి...
సముద్రంలో కలిసి...
అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూ రంలో బ్రహ్మగిరిపై బింధువుగా మొదలైన గోదావరి నది తూర్పువైపునకు 1,465 కి లోమీటర్ల మేర సాగి బంగాళాఖాతంలో ము గుస్తుంది. తెలంగాణ వాసుల కల్పతరువు, ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచే గోదావరి నది నీటి ప్రవాహం కాళేశ్వరం గుండా భద్రాచలం మీదుగా ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. చివరగా ఒక పాయ యానం వద్ద మరొకటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి చెంత సముద్రంలో కలిసిపోతుంది.
ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు గోదావరి నది కనువిందు చేస్తుంది. శుభ, అశుభ కార్యాల్లోనూ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవారంతా దక్షిణగంగగా కొలుచుకునే గోదావరి నదిలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ ఉండే బ్రాహ్మణులు, బోట్లు తిప్పే వారికి ఉపాధి తెచ్చిపెడుతుంది. గోదావరి నది పొడవున జాలర్లు రోజూ చేపలు పట్టి జీవనం వెళ్లదీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు గోదావరి నదిపై ఎన్నో చోట్ల రోడ్డు, రైలు వంతెనలు కనిపిస్తాయి.

● బాసర నుంచే దక్షిణ గంగ ప్రారంభం ● నదీ తీరంలో అనేక పుణ్