
కౌలురైతు ఆత్మహత్యాయత్నం
నెన్నెల: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట వడగళ్ల వానకు దెబ్బతినడంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలాతీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన నిరుపేద కౌలురైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంగారాం గ్రామానికి చెందిన కడారి బక్కన్న మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరిపైరు నేలకొరిగి వడ్లన్నీ నేలరాలాయి. దీంతో పంట పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బాధితుని భార్య మమత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. ఘటనపై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.