
ట్రిపుల్‌ఐటీ విస్తరణ
● బాసరకు అనుబంధంగా మరో రెండుచోట్ల ఏర్పాట్లు ● ఎల్కతుర్తిలో పూర్తయిన భూసర్వే ● మహబూబ్‌నగర్‌లోనూ భూ పరిశీలన
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీకి అనుబంధంగా మరో రెండు క్యాంపస్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఎల్కతుర్తిలో భూసర్వే పూర్తిచేసిన అధికారుల బృందం తాజాగా ఈనెల 3న మహబూబ్‌నగర్‌లోనూ భూములు పరిశీలించింది. బాసర ట్రిపుల్‌ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్ మాజీ రిజిస్టార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ రెవెన్యూ అధికారులతో కలిసి మహబూబ్‌నగర్ సమీపంలోని భూములను పరిశీలించారు. 40 నుంచి 50 ఎకరాల భూములు అవసరమవుతాయని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డికి తెలిపారు. అధికార బృందంతో ఎమ్మెల్యేతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించింది.
అనుబంధంగా మరో రెండు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామీణ నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ట్రిపుల్‌ఐటీలను ప్రారంభించారు. నూజివీడు, ఇడుపులపాయతోపాటు బాసరలో ట్రిపుల్‌ఐటీలను నెలకొల్పారు. ఒక్కో క్యాంపస్‌లో 1500 మంది విద్యార్థులకు సీట్లు ఇచ్చి అవకాశాలు కల్పించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒకే ట్రిపుల్ ఐటీ బాసరలో మిగిలింది. ఈ క్యాంపస్‌కు అనుబంధంగా మరో రెండు ట్రిపుల్‌ఐటీల ప్రారంభంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
కొత్త ప్రభుత్వం రావడంతోనే..
గత పదేళ్లపాటు కేసీఆర్ హయాంలో ఒకే ట్రిపుల్‌ఐటీ ఉండగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త క్యాంపస్‌ల ఏర్పాటుపై దృష్టిసారించింది. గత ఎన్నికల ప్రచారంలో నాలుగు ట్రిపుల్‌ఐటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులోభాగంగా ఇప్పటికే ఎల్కతుర్తి, మహబూబ్‌నగర్‌లో భూసర్వేలు పూర్తిచేసింది. త్వరలోనే ఖమ్మం, నల్గొండలోనూ మరో రెండు క్యాంపస్‌ల ఏర్పాట్లపై దృష్టిసారించింది.
పెరుగనున్న సీట్లు
రాష్ట్రంలో ఉన్న ఏకై క ట్రిపుల్‌ఐటీ బాసరలో ఏటా ప్రవేశాల సమయంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆరేళ్ల ఇంజినీరింగ్ విద్యావిధానంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులకు ట్రిపుల్‌ఐటీలో చేర్పించాలన్న కోరిక పెరుగుతుంది. తాజాగా రెండుచోట్ల కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేయనుండడంతో 3 వేల సీట్లు పెరగనున్నాయి. రెండు కొత్త క్యాంపస్‌లు ప్రారంభమైతే బాసరతోపాటు అనుబంధంగా ఏర్పడే ఎల్కతుర్తి, మహబూబ్‌నగర్ ట్రిపుల్‌ఐటీల్లో ప్రతిఏటా 4500 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం దక్కుతుంది. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కొత్త క్యాంపస్‌లు ఎంతో మేలు చేయనున్నాయి.
బాసర ట్రిపుల్‌ఐటీ
నివేదించాం
మహబూబ్‌నగర్ సమీపంలో ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు కోసం భూములు పరిశీలించాం. గత మూడు నెలల క్రితం ఎల్కతుర్తిలో భూములను పరిశీలించాం. బాసరకు అనుబంధంగా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు భూములు పరిశీలించి సర్కారుకు నివేదించాం.
– గోవర్ధన్, ట్రిపుల్‌ఐటీ వీసీ, బాసర