
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వినియోగించాలి
మంచిర్యాలటౌన్: వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను వినియోగించాలని పాత్ ఎన్జీవో స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ జావిద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో కలిసి సోమవారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఆయుష్మాన్ భారత్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఆసుపత్రులకు, ఫార్మసీకి వచ్చే రోగుల హెల్త్‌కార్డును లింక్ చేస్తే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతీ కార్డుకు రూ.20 చొప్పున ఇన్సెంటివ్ పొందవచ్చని తెలిపారు. రోగుల సంరక్షణకు, డిజిటల్ ఆరోగ్య సేవలను ప్రజలు పొందేందుకు, వారి ఆరోగ్య డేటా సంరక్షించుకునేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఉపయోగపడుతుందని వివరించారు. పాత్ ఎన్జీవో సభ్యులు నరేశ్, డీపీవో ప్రశాంతి, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రవళిక, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు.