
ఆత్మహత్యాయత్నం
ఇళ్ల జాబితాలో పేరు లేదని
కోటపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని మనస్తాపం చెంది మండలంలోని రొయ్యపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్(30) ఆత్మహత్యాయత్నం చేశాడు. రవీందర్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామంలో 93మందితో అర్హుల జాబితా ప్రకటించగా అందులో పేరొచ్చింది. మొదటి దశలో 22మందిని ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. ఇందులో పేరు లేకపోవడంతో కమిటీ సభ్యులు రాజకీయ కారణాలతో తన పేరు తొలగించారని మనస్తాపం చెందిన రవీందర్ బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని, నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. మళ్లీ సర్వే నిర్వహించి అర్హులకే ఇళ్లు అందజేస్తామని తెలిపారు. రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, ఆయనతో ఫోన్‌లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.