
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన మాధవరపు యశిక ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్(యూఎస్‌ఎంఎల్‌ఈ)లో అరుదైన ఘనత సాధించింది. రెండు విడతలుగా జరిగిన పరీక్షల్లో ఫ్యామిలీ మెడిసిన్‌లో సీటు సంపాదించింది. మూడేళ్ల తర్వాత వచ్చే పీజీ పట్టాతో ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వైద్యసేవలు అందించేలా అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
యశిక 1 నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లో పూర్తి చేసింది. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలతో అనుసంధానమైన అమెరికా న్యూయార్క్‌లోని జేవియర్ వైద్య కళాశాలలోని ఎండీ(డాక్టర్ ఆఫ్ మెడిసిన్) కోర్సును పూర్తి చేసి అమెరికాలోని చికాగోలో 18 నెలల స్టెప్–1, స్టెప్–2 క్లినికల్స్ కూడా పూర్తి చేసింది. తల్లిదండ్రులు శిల్ప, రాజేశ్వర్‌రావు రాజకీయాల్లో రాణిస్తున్నారు. యశికను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు హాజీపూర్ మండల వాసులు ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.