
చెత్త సేకరణ అధ్వానం
బెల్లంపల్లి: ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీ బెల్లంపల్లిలో చెత్త సేకరణ అధ్వానంగా మారింది. పట్టణంలో 34 వార్డుల్లో రోజువారీగా చెత్త సేకరించాల్సి ఉండగా.. పారిశుద్ధ్య సిబ్బంది, ఆటోట్రాలీల సమస్య కారణంగా మూడు నాలుగు రోజులకోసారి సేకరణ జరుగుతోంది. శివారు వార్డుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కనీసం పక్షం రోజులకోసారైనా చెత్త తొలగించడం లేదనే ఆరోపణలున్నాయి. రోజువారీగా 25టన్నుల చెత్త వెలువడుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పుర ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఖరారు కాని డంపింగ్ యార్డు
మున్సిపాల్టీ ఏర్పడి 38ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు డంపింగ్ యార్డు లేకుండా పోయింది. ఒకటోవార్డు కన్నాల బస్తీ శివారులో రెండు దశాబ్దాల క్రితం ఐదెకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పరిధిలోకి వెళ్లడంతో అధికారికంగా మళ్లీ ఎక్కడ నిర్వహించాలో ఖరారు చేయలేదు. 65డీప్, శాంతిఖని బస్తీల మధ్య ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రతిపాదించి అక్కడ చెత్త వేస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. దీంతో గోల్‌బంగ్లాబస్తీ, గురిజాలకు వెళ్లే మార్గంలో ఉన్న హిందుశ్మశాన వాటికలో అనధికారికంగా చెత్త డంప్ చేశారు. దుర్వాసన వస్తుండడంతో తాజాగా గోల్‌బంగ్లాబస్తీ, నంబరు–2 ఇంకై ్లన్ బస్తీ వాసులు ఆందోళన చేశారు. అక్కడి నుంచి మళ్లీ కాసిపేట శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలో చెత్త వేస్తున్నారు. వార్డుల నుంచి సేకరించిన చెత్తను కోర్టు ముందు ఉన్న రైతుబజార్ స్థలంలో నిల్వ చేస్తున్నారు. అక్కడ దుర్వాసన వెదజల్లుతుండడంతో సమీప ఇళ్ల ప్రజలు భరించలేకపోతున్నారు. సమయానుకూలంగా ట్రాక్టర్లు, ఆటో ట్రాలీల్లో అక్కడి నుంచి కాసిపేట శివారులోని ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారు. జనావాసాలకు చేరువలో డంప్ యార్డు వద్దని కాసిపేట ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో డంప్‌యార్డును అధికారికంగా ఏర్పాటు చేయడంలో సతమతం అవుతున్నారు.