జన్నారం: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఎల్‌ఎండీ సమీపంలోని కాలువలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల లింగన్న, శంకరవ్వల కుమారుడు అరవింద్ (18) కరీంనగర్‌లోని ఎస్సార్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్‌ఎండీలో సమీపంలోని కాలువలోకి స్నానం కోసం వెళ్లి గల్లంతయ్యాడు. కాగా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి కేసీ కెనాల్‌లో శుక్రవారం అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు యువకుడి బంధువులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
బెజ్జూర్: ఇటీవల మండలంలోని ఊట్‌పల్లి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరగ్గా తీవ్ర గాయాలపాలైన అందుగులగూడ గ్రామానికి చెందిన గేడం వెంకటి(45) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన వెంకటిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మృతుడి భార్య పద్మ తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
ఎల్‌ఎండీ సమీపంలోని కాలువలో విద్యార్థి గల్లంతు