పంట దిగుబడి రాక రైతు ఆత్మహత్య
తలమడుగు: పంట ఆశించిన దిగుబడి రాక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్నకు ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఈ ఏడాది పత్తి, కంది పంటలు సాగు చేశాడు. గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రావడం లేదు. పెట్టుబడి కోసం గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. ఇతర ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీ కాకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. కుటుంబ పోషణ భారమై, అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. శుక్రవారం పొలానికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. అక్కడే లింగన్న(48) చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వంశీ, శరత్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అంజమ్మ తెలిపారు.
వేధింపులు తాళలేక వ్యక్తి..
రెబ్బెన: ఇచ్చిన డబ్బులు అడగటమే తన పాలిట శాపంగా మారింది. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా తనకే డబ్బులు ఇవ్వాలని లేకుంటే కేసులు పెడతానని ఓ వివాహిత మహిళతో పాటు కొంతమంది నాయకులు వేధించడంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగాపూర్‌లో చోటు చేసుకుంది. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల ప్రకాశ్ (53) గంగాపూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గుర్లె సోనీ అనే వివాహిత ప్రకాశ్‌కు మద్యం అలవాటు చేయడంతో పాటు అప్పుడప్పుడూ ప్రకాశ్ వద్ద నుంచి అవసరానికి డబ్బులు తీసుకునేది. కొన్ని నెలల క్రితం సోనికి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ప్రకాశ్ కోరగా నిరాకరించడంతో పాటు తనకే రూ.లక్ష బాకీ ఉన్నావని ఎప్పుడు ఇస్తావంటూ వేధించింది. డబ్బులు ఇవ్వకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడింది. సోనికి మద్దతుగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు డబ్బులు చెల్లించాలంటూ వేధించడంతో ప్రకాశ్ గురువారం రాత్రి గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన గ్రామస్తులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రకాశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు రాకేశ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని యువకుడు..
రామకృష్ణాపూర్: పట్టణంలోని ఏజోన్ రామ్‌నగర్ ఏరియాకు చెందిన అడ్లకొండ శ్రీకాంత్(32) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్ స్థానిక ఓ కన్స్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. డబ్బుల లావాదేవీలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు వేధించడంతో భరించలేక తనువు చాలిస్తున్నట్లు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆత్మహత్య ఘటన బయటకు వచ్చిందని ఎస్సై తెలిపారు. కాగా మృతుడి భార్య కరోనా సమయంలో మృతిచెందగా ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య