ప్రతీ వార్డులో బాధితులు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ వార్డులో బాధితులు

Sep 22 2023 1:58 AM | Updated on Sep 22 2023 1:58 AM

- - Sakshi

ఒకే యంత్రంతో ఫాగింగ్‌
పారిశుధ్యం అస్తవ్యస్తం

నివారణ చర్యల్లో నిర్లక్ష్యం

విపరీతంగా పెరిగిన దోమలు

రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రి

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీలో జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాడ వాడల్లో ఇంటికొకరు జ్వరంతో బాధ పడుతున్నారు. జ్వర బాధితులతో చెన్నూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం కిటకిటలాడుతోంది. జ్వరాల బారిన పడిన రోగుల్లో రక్తకణాలు తగ్గుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. చెన్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు 80 నుంచి 90 మంది వరకు, ప్రైవేట్‌, పట్టణ ప్రాంతాల్లో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. వైరల్‌ జ్వరాలు సోకిన వందలో 70 శాతం మంది దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నా జ్వరం తగ్గుముఖం పట్టకపోగా, దగ్గుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన దోమలు..

మున్సిపాలిటీలోని ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు అడవులను తలపిస్తున్నాయి. ఖాళీ ప్లాట్లలో వర్షపు నీరు నిలువడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దోమలు స్వైర విహారం చేస్తూ వైరల్‌ జ్వరాలకు కారణమవుతున్నాయి.

జిల్లాలో నమోదైన సీజనల్‌ వ్యాధుల వివరాలు

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో రెండు ఫాగింగ్‌ యంత్రాలు ఉండగా ఒకటి పని చేయడం లేదు. దీంతో ఒకే యంత్రంతో ఫాగింగ్‌ నిర్వహిస్తున్నారు. అన్ని వార్డుల్లో ప్రతీ రోజు ఫాగింగ్‌ చేయకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. పలు వార్డుల్లో ఇళ్ల మధ్య ఉన్న ఓపెన్‌ ప్లాట్లు మురికి కూపాలుగా మారి దోమలకు నివాస కేంద్రాలుగా మారాయి. దోమలు వృద్ధి చెంది సీజనల్‌ వ్యాధులు, డెంగీకి కారణమవుతున్నాయి. పట్టణంలో సీజనల్‌ వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాలు అధికంగా కురువడంతో నీరు కలుషితమై ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఆరు డెంగీ పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు నస్పూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి సమత తెలిపారు. ఆస్పత్రిలో రోజురోజుకు ఓపీ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు 50 నుంచి 60 మంది రోగులు వచ్చేవారు ప్రస్తుతం రోజుకు 100కు పైగా వస్తున్నారు. ఎక్కువగా టైఫాయిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. జ్వర బాధితులు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వైద్యులు తెలిపారు.

విష జ్వరాలు 89,500

డెంగీ 55

డయేరియా 2,780

టైఫాయిడ్‌ 1,269

జ్వర సంబంధిత వ్యాధులు 19,800

వ్యాధుల నియంత్రణకు చర్యలు

జిల్లాలో సీజనల్‌ వ్యా ధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వైద్య సిబ్బంది వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స, మందులు అందిస్తున్నారు. వ్యాధులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయో గుర్తించి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– డాక్టర్‌ సుబ్బరాయుడు, జిల్లా వైద్యాధికారి

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర బాధితులు

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతీ ఇంట్లో ప్రజలు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులు అధికంగా నమోదు అవుతుండడం గమనార్హం. ప్రతియేటా డెంగీ కేసులు నమోదవుతున్నా దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు కలిసి పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి, నీరు నిల్వ లేకుండా చేయడం, దోమలు వృద్ధి చెందిన చోట దోమల మందు చల్లడం, డెంగీ వంటి కేసులు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి, వారికి డెంగీ ఎలా సోకిందో నిర్దారణ చేసుకుని, చుట్టు పక్కల వారికి రాకుండా చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వమే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు ఏటా నిర్వహిస్తున్నా ఈ ఏడా ది వాటి ఊసే లేదు. వాతావరణంలో మార్పులు, వర్షాలు కురవడం, ఎండలతో ఉష్ణోగ్రతలు పెరగ డం వల్ల ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమల వృద్ధికి ఆవాసంగా మారుతున్నాయి. దీంతోనే విషజ్వరాలతోపాటు డెంగీ, రక్తకణాలు తగ్గి పోవడం సమస్యగా మారుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ నిర్దారణ పరీక్షలకు అవకాశం లేకపోవడం, రక్తకణాలు తగ్గిన వారి రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంకుకు పంపించి ఎలిసా టెస్టు ద్వారా డెంగీ నిర్దారణ చేయాల్సి ఉంటుంది. కానీ రక్త కణాలు తగ్గిన వారికి ప్రైవేటులో డెంగీ పేరిట వైద్యం అందిస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు అవుతుండడం, ఏది విష జ్వరమో, ఏది డెంగీ జ్వరమో తెలియక ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.

సీహెచ్‌సీలో నమోదైన జ్వరాల వివరాలు

తేదీ బాధితులు

16 80

17 85

18 83

19 90

20 93

21 92

దోమలు రాకుండా

చర్యలు తీసుకోవాలి

వర్షాకాలం కావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమలు రాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కాలనీలను పరిశుభ్రంగా ఉంచుతూ దోమల మందు పిచికారీ చేస్తే కొంత వరకు తగ్గుతాయి. ఖాళీగా ఉన్న ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడం, డ్రెయినేజీ నీరు, వర్షపు నీరు చేరుతోంది. ఖాళీ ప్లాట్లలో వర్షాకాలం ముగిసే వరకు పిచ్చిమొక్కలు పెరగకుండా, వర్షపు నీరు నిల్వ లేకుండా యజమానులు చర్యలు తీసుకోవాలి.

– ఎం.సుజాత, మంచిర్యాల

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం వైద్యం కోసం వస్తున్న వారి సంఖ్య రోజువారీగా సగటున 250 వరకు ఉంటోంది. వీరిలో గరిష్టంగా 50మందికి పైగా ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రధానంగా వైరల్‌, టైఫాయిడ్‌ జ్వరం బాధితులు వస్తున్నారు. డెంగీ, మలేరియా నిర్దారణ రక్తపరీక్షలు చేయడం లేదు. దీంతో ప్రాణాంతకమైన డెంగీ జ్వర పీడితుల సంఖ్య తెలియకుండా పోతోంది. మలేరియా జ్వరంతో బాధ పడుతున్న రోగులు ఎంతమంది వస్తున్నారో నిర్దారణ కాకుండా ఉంది.

● మురికినీటి గుంతలు, కాలువలు, పిచ్చిమొక్కలు దోమలకు ఆవాసాలుగా మారాయి. మున్సిపాలిటీలోని వార్డుల్లో రోజువారీగా పారిశుధ్య పనులు పనులు చేపట్టక పోవడం, మురికి కాలువల్లో పూడిక తీయించకపోవడంతో దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయి. దోమల నివారణకు క్రమం తప్పక ఫాగింగ్‌ చేయాల్సి ఉండగా ఓ మారు బస్తీల్లో, ప్రధాన రహదారి వెంట ఫాగింగ్‌ చేసి సరిపెడుతున్నారు.

● ఈ నెల 16న 246 మంది ఆస్పత్రికి రాగా 58మంది ఇన్‌పేషంట్లుగా చేరారు. మరో 70 మంది వైరల్‌ఫీవర్‌, 27మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు నిర్దారించారు.

● 17న 140 మంది అవుట్‌ పేషెంట్లు రాగా వీరిలో 93 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. 27 మందికి వైరల్‌ఫీవర్‌, 18 మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు తేల్చారు.

● 18న 170మంది చికిత్స కోసం రాగా ఇందులో 61 మంది ఆస్పత్రిలో చేరారు. 28 మందికి వైరల్‌ ఫీవర్‌, 26 మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు గుర్తించారు.

● 19న 370 మంది రోగులు రాగా వీరిలో 61 మంది ఆస్పత్రిలో చేరారు. మరో 81 మందికి వైరల్‌ఫీవర్‌, 28 మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు తేల్చారు.

● 20న 320 మంది అవుట్‌ పేషెంట్లు రాగా 58 మంది చికిత్స కోసం చేరారు. మరో 52 మందికి వైరల్‌ ఫీవర్‌, 18 మందికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చినట్లు రక్త పరీక్షల్లో వెల్లడైంది. డెంగీ జ్వరం వస్తున్నా రక్త పరీక్షలు చేయకపోవడంతో తీవ్రత తెలియడం లేదు.

● 21న 210 మంది ఓపీ రాగా వీరిలో 62 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. రక్తపరీక్షలు చేసి 58 మందికి వైరల్‌ ఫీవర్‌, మరో 19 మంది టైఫాయిడ్‌ ఉన్నట్లు నిర్దారించారు.

మంచిర్యాల మున్సిపాలిటీలో పెరుగుతున్న డెంగీ

విష జ్వరాల బారిన ప్రజలు

అంతంత మాత్రంగానే అధికారుల చర్యలు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా.. రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లో ప్రవహిస్తూ దోమల వృద్ధికి కారణంగా మారుతోంది. పట్టణంలోని అన్ని వార్డుల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్‌ చేపట్టాల్సి ఉన్నా రెగ్యులర్‌గా చేయకపోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు అనే కార్యక్రమాన్ని మున్సిపల్‌ పరిధిలో పాలకులు, అధికారులు చేపట్టి ప్రజలతో చేయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. డ్రెయినేజీల్లోని పూడికతీత పనులు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు డ్రెయినేజీల్లో నుంచి వెళ్లకుండా రోడ్లపై పారుతోంది. పందుల స్వైరవిహారం, ఖాళీ ప్లాట్లలో నిలిచిన వర్షపు, మురుగు నీటితో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 11 మంది డెంగీ బారిన పడ్డట్లు నిర్దారించగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 30 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇటీవల పాతమంచిర్యాలకు చెందిన పదేళ్ల బాలుడు డెంగీ లక్షణాలతో మృతిచెందినా, సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.

మంచిర్యాల మున్సిపాలిటీలో

నమోదైన డెంగీ కేసులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

రామకృష్ణాపూర్‌: వాతావరణంలో మార్పులు, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్‌ జ్వరాలు పంజా విసురుతున్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనూ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీ వార్డులో జ్వర బాధితులు కనిపిస్తున్నారు. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధి కంగా కనిపిస్తున్నారు. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలోనూ ఈ లక్షణాలతో చేరే వారే ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్క ప్రభుత్వాసుపత్రి కూడా లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సింగరేణి కార్మిక కుటుంబాలు మినహా వైరల్‌ జ్వరాలబారిన పడిన వారు మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రులతోపాటు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో నీరు నిలువ ఉన్న చోట దోమల మందు పిచికారీ చేస్తున్నారు. 22 వార్డుల్లోనూ ఫాగింగ్‌ చేస్తున్నారు. సింగరేణి పరిధిలోని కార్మికకాలనీలలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంది. కంపెనీ క్వార్టర్ల మధ్యే చెత్తచెదారం పోస్తున్నారు. దోమల నివారణకు కంపెనీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థా నిక జవహర్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు ఇటీవలే డెంగీ పాజిటివ్‌ రాగా ప్రస్తుతం కోలుకుంటోంది.

ఆర్‌కేపీలో రోడ్డుపైనే దర్శనమిస్తున్న చెత్త

జిల్లాలో 55 డెంగీ కేసులు నమోదు

89,500 మందికి మలేరియా పరీక్షలు

19,800 మందికి జ్వర సంబంధిత వ్యాధులు

మున్సిపల్‌, పంచాయతీల్లో కానరాని నియంత్రణ

సంవత్సరం సంఖ్య

2021 22

2022 35

2023(ఇప్పటి వరకు) 11

1
1/9

2
2/9

శ్రీనివాస కాలనీలో డ్రెయినేజీ నిర్మించక పోవడంతో ఖాళీ స్థలంలో నిలిచిన మురుగు నీరు3
3/9

శ్రీనివాస కాలనీలో డ్రెయినేజీ నిర్మించక పోవడంతో ఖాళీ స్థలంలో నిలిచిన మురుగు నీరు

4
4/9

చెన్నూర్‌లో ఖాళీ ప్లాట్ల నుంచి వెళ్తున్న నీరు5
5/9

చెన్నూర్‌లో ఖాళీ ప్లాట్ల నుంచి వెళ్తున్న నీరు

మున్సిపాలిటీకి వెళ్లే దారిలో ఇళ్ల
మధ్యలో నీళ్లతో నిండి పెరిగిన గడ్డి6
6/9

మున్సిపాలిటీకి వెళ్లే దారిలో ఇళ్ల మధ్యలో నీళ్లతో నిండి పెరిగిన గడ్డి

7
7/9

8
8/9

9
9/9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement