పేదలకు 200గజాల ఇంటి స్థలం | - | Sakshi
Sakshi News home page

పేదలకు 200గజాల ఇంటి స్థలం

Mar 30 2023 12:24 AM | Updated on Mar 30 2023 12:24 AM

- - Sakshi

బెల్లంపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు 200గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హామీనిచ్చారు. బుధవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో జరిగిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇచ్చిన హామీల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ‘కల్వకుంట్ల’ కుటుంబానికే చెందుతున్నాయి తప్ప పేదల దరి చేరడం లేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నప్రత్నాల లీకేజీ సర్వసాధారణమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వేలాది ఎకరాల భూములు నీటమునిగినా పరిహారం మంజూరు చేకుండా రైతాంగాన్ని వంచించారని తెలిపారు.

ఐదు స్థానాలు స్థానికులకే ఇవ్వాలి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్‌ పార్టీ స్థానికులకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్‌రావు కోరారు. ఎవరికిచ్చినా ఫర్వాలేదని, డబ్బులు లేకపోయినా ప్రజల గదువ పట్టుకుని ఓట్లడిగి గెలిపించుకుంటామని తెలిపారు. స్థానికులకు టిక్కెట్‌ ఇవ్వకుంటే ఏ పోరాటానికై నా సిద్ధపడతామని స్పష్టం చేశారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురు ఔత్సాహిక అభ్యర్థులు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని తెలిపారు. సీనియర్‌ నాయకుడు చిలుముల శంకర్‌, ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రొడ్డ శారద, సర్పంచ్‌ వేముల కృష్ణ, యువ నాయకుడు నాతరి స్వామిని సభ వేదికగా సీఎల్పీ నేత విక్రమార్కకు, సభకు హాజరైన ప్రజలకు పరిచయం చేసి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆశలు నింపారు.

ఉత్సాహంగా

బెల్లంపల్లి శివారు కన్నాలలో మంగళవారం రార్రి బస చేసిన విక్రమార్క రెండో రోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎం.సూరిబాబు, కాంగ్రెస్‌ నాయకులు తొంగల మల్లేష్‌, బండి ప్రభాకర్‌, రొడ్డ శారద, నాతరి స్వామి, కత్తి కార్తీక, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్‌వర్దన్‌ రాజు పాల్గొన్నారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. పాదయాత్రలో ప్రజా గాయకుడు గద్దర్‌ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు.

నేడు సీతారాముల కళ్యాణ వేడుకల్లో..

భట్టి విక్రమార్క గురువారం బెల్లంపల్లిలో బస చేయనున్నారు. శ్రీరామనవమి కావడంతో పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. బెల్లంపల్లిలోని కోదండ రామాలయంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవంలో విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి పాల్గొంటారు.

ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement