పాడి రైతులను ఆకర్శించేందుకు పశుసంవర్థక శాఖలో గత కొన్నేళ్లుగా పని చేస్తున్న గోపాలమిత్రలతోపాటు మరికొందరు సిబ్బందినే డెయిరీలో ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ప్రభుత్వ శాఖలోని వారే ప్రచారం చేయడంతో అందరూ నమ్మారు. చివరకు అటు గేదేలు అందక, ఇటు డబ్బులు తిరిగి పొందలేక అనేక మంది రైతులు అవస్థలు పడుతున్నారు. దాదాపు 50మంది వరకు కనీసం రూ.70వేల నుంచి రూ.3.50లక్షల వరకు చెల్లించిన వారు ఉన్నారు. గత జనవరిలో జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట, భీమారం, నెన్నెల, లక్సెట్టిపేట, జన్నారం, తాండూరు పరిధిలో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిర్వాహకులు సైతం గేదెలు తీసుకుని డబ్బులు చెల్లించలేదని, ఇద్దరిపై ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో తమ డబ్బులు తమకు తిరిగి వస్తాయో లేదో తేల్చుకోలేని స్థితిలో బాధితులు ఉన్నారు. డబ్బులు చెల్లించిన వారిలో నిరుపేద రైతులు ఉండగా, మరికొందరు పెద్ద వ్యాపారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నిర్వాహకులపై కేసుల్లో కొన్నింటిపై బెయిల్ వచ్చింది. మరికొన్నింటిలో బెయిల్ రావాల్సి ఉంది. ఇంకా కేసు దర్యాప్తు సాగుతోంది.