గడువు తీరిన పాల ప్యాకెట్ల అమ్మకాలు! | - | Sakshi
Sakshi News home page

గడువు తీరిన పాల ప్యాకెట్ల అమ్మకాలు!

Mar 30 2023 12:24 AM | Updated on Mar 30 2023 12:24 AM

గడువు తీరిన పాల ప్యాకెట్‌
 - Sakshi

గడువు తీరిన పాల ప్యాకెట్‌

దండేపల్లి(మంచిర్యాల): మండలంలోని కొర్విచెల్మలో ఓ కిరాణ దుకాణంలో గడువు తీరిన పాల ప్యాకెట్ల (సోయ పాలు) విక్రయం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన హనుమాన్‌ దీక్షాస్వాములు బుధవారం కిరాణ దుకాణంలో పూజాసామగ్రితో పాటు, పాలు కొనుగోలు చేశారు. దీంతో దుకాణం యజమాని వారికి గడువు తీరిన పాల ప్యాకెట్లు ఇవ్వడంతో వాటిని గమనించిన స్వాములు నివ్వెరపోయారు. పాల ప్యాకెట్ల గడువు గత నెల 27 వరకే ఉంది. గడువు ముగిసి నెల రోజులు దాటినా వాటినే ప్రజలకు విక్రయించడంపై మండి పడ్డారు. విషయాన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశారు.

నెన్నెలలో పురాతన రాతి విగ్రహం లభ్యం

నెన్నెల(బెల్లంపల్లి): మండలం కేంద్రంలోని పెద్ద చెరువులో పురాతన వినాయక రాతి విగ్రహం ఉన్నట్లు హనుమాన్‌ దీక్షాపరులు గుర్తించారు. విగ్రహాన్ని బయటకు తీసి ఒక చెట్టు కింద ఉంచి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఇది సుమారు 800ల సంవత్సరాల క్రితం నాటిదని, చాళుక్యులు దేవాలయం గర్భగుడి ద్వారానికి పైభాగానికి సంబంధించిన రాతి విగ్రహమని గన్‌పూర్‌కు చెందిన చారిత్రక, పురావాస్తు పరిశోధకుడు పంజాల సాయిరాం తెలిపారు.

ఎడ్లు చోరీ

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌కు చెందిన రైతులు వైరాగడే ఆనంద్‌రావు, వైరాగడే శ్రవణ్‌, మెంగ్రె బాబురావుకు చెందిన ఎడ్లు ఉదయం మేత కోసం బయటకు వెళ్లాయి. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో రైతులు శివారు ప్రాంతంలో వెతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గుండి రహదారి సమీపంలోని ఒర్రె వద్ద మూడు ఎడ్లు చెట్టుకు కట్టేసి ఉండడంతో వాటిని వదిలేసి ఇంటికి తరలించారు. గతంలో సైతం జిల్లా కేంద్రానికి చెందిన పలువురి ఆవులు సైతం అదృశ్యమయ్యాయి. కొంత మంది వ్యక్తులు పశువులను బంధించి, కబేళాలకు తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

అదుపుతప్పి లారీ బోల్తా..

భైంసాటౌన్‌: పట్టణంలోని భైంసా–బాసర రహదారిపై బుధవారం వేకువజామున లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భైంసాలోని కాటన్‌ జిన్నింగ్‌ మిల్లు నుంచి పత్తి బేళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ స్థానిక హరియాలీ ఫంక్షన్‌హాల్‌ సమీపంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో లారీలో పత్తిబేళ్లు కింద పడిపోయాయి. డ్రైవర్‌, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. 161 బీబీ రహదారి పనుల్లో జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పనులు జరుగుతున్న చోట హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పూజలు చేస్తున్న స్వాములు
1
1/1

పూజలు చేస్తున్న స్వాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement