
ఏకలవ్యుడికి ఘన నివాళి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఏకలవ్యుడి జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక పద్మావతికాలనీలోని ఆయన విగ్రహానికి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం (గిరిజన) ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఏటా తొలి ఏకాదశి నాడు ప్రభుత్వమే ఏకలవ్యుడి జయంత్యుత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు వెంకట్రాములు, నర్సింహులు, శ్రీనివాసులు, రామచంద్రయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రీడాకారులుజాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్‌రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్‌లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్‌ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్‌లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఎండీసీఏ తరపున క్రీడాకారులను క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, ముఖ్తార్ పాల్గొన్నారు.
ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు
శ్రీకాంత్– కెప్టెన్ (షాద్‌నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్‌నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్‌నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్‌నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్, శశాంక్ (మహబూబ్‌నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్‌కర్నూల్), హర్షిత్, జి.కేతన్‌కుమార్, అక్షయ్ సాయి (జడ్చర్ల), జశ్వంత్ (నాగర్‌కర్నూల్) ఉన్నారు.

ఏకలవ్యుడికి ఘన నివాళి