
ఎస్‌జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో పోటీలు
● షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
● నాలుగు దశల్లో క్రీడల నిర్వహణ
● ఆగస్టు మొదటి వారం నుంచి పోటీలు ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రీడలు: ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ –14, అండర్– 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఎస్‌జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారు.
● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్‌జీఎఫ్ క్రీడా షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసింది. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్‌జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించి, పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు.
జిల్లాకు జాతీయ క్రికెట్ టోర్నీలు
జిల్లాలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ క్రికెట్ అండర్–17 బాలుర, బాలికల చాంపియన్‌షిప్‌లు నిర్వహించనున్నారు. ఇటీవలే నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు 2025–26 జాతీయస్థాయి టోర్నీలకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేయగా మహబూబ్‌నగర్‌కు అండర్–17 బాలబాలికల క్రికెట్ టోర్నీలు కేటాయించారు. బాలుర క్రికెట్ టోర్నీని దసరా సెలవుల్లో అనగా అక్టోబర్‌లో, బాలికల క్రికెట్ పోటీలు సంక్రాంతి సెలవులు జనవరిలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం...
ఈ ఏడాది అండర్–17, అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గతేడాది ఉమ్మడి జిల్లాకు కేటాయించిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్, రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీల ప్రతిపాదనలు త్వరలో పంపుతాం.
– శారదాబాయి, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్

ఎస్‌జీఎఫ్ సందడి

ఎస్‌జీఎఫ్ సందడి