
ప్రతిభను గుర్తించేందుకే పోలీస్ డ్యూటీ మీట్
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుల్లో ప్రతిభను గుర్తించేందుకే పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. గురువారం పోలీస్ పరేడ్ మైదానంలో జోనల్ పోలీస్ డ్యూటీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు మరింత నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో సిబ్బంది నేర పరిశోధనతోపాటు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారని, ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి 150 మంది సిబ్బంది హాజరయ్యారని చెప్పారు. శుక్రవారం పోలీస్ డ్యూటీ ముగింపు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల ఎస్పీలు పాల్గొంటారన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో వివిధ విభాగాల్లో పోలీస్ సిబ్బంది ప్రతిభను గుర్తించేందుకు ప్రాక్టికల్స్‌తోపాటు పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. గురువారం డ్యూటీమీట్‌లో క్రైం ఇన్వెస్టిగేషన్, మెడికో లీగల్ టెస్ట్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్సిబిట్స్, ఫింగర్ ప్రింట్స్, క్రైం సీన్ ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, అబ్జర్వేషన్ టెస్ట్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సైన్స్ రిటన్ టెస్ట్‌లను నిర్వహించినట్లు పేర్కొన్నారు.