
గురుకులాలను సందర్శించిన కలెక్టర్
దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రంలోని పలు గురుకుల పాఠశాల, కళాశాలలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించారు. అలాగే ఇతర సదుపాయాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. రాయచూరు రోడ్డులో ఎస్‌బీఐ పక్కన ఉన్న తెలంగాణ బాలుర, చౌదర్‌పల్లి వద్ద స్వీట్స్ కళాశాల భవనంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల, మైనార్టీ గురుకుల పాఠశాల, అమ్మాపూర్ రోడ్డులోని జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, తాగునీరు, మంచాలు వంటి వాటిపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట దేవరకద్ర తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
ఎన్నికల నియమావళి పాటించాలి
రాజాపూర్: గ్రామస్థాయి బూత్‌లెవల్‌లో ఉన్న బీఎల్‌ఓలు ఎన్నికల నియమావళిని పాటించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌ఓలకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఓటర్ల నమోదు తొలగించుట ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాధాకృష్ణ, శ్రీనివాస్, సూపర్‌వైజర్లు ఏఎస్‌ఓ శ్రీకాంత్, మంజుల, యాదయ్య పాల్గొన్నారు.
కొత్త రకం సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్‌నగర్ క్రైం: పేదలను లక్ష్యంగా చేసుకుంటూ కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అవగాహనతో ఉండకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. పీఎం కిసాన్ యోజన పథకం అడ్డుపెట్టుకొని నకిలీ యాప్‌ల ద్వారా ఓటీపీలు తీసుకుని ఖాతాలో ఉన్న డబ్బు దోచుకుంటున్నట్లు తెలిపారు. పార్ట్ టైం ఉద్యోగాలు, మీ షో పేరుతో ఆర్డర్ రేటింగ్ లింక్స్ పంపించి మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జలమండలి, విద్యుత్‌శాఖ అధికారుల పేరిట ఫోన్లు చేసి బిల్లు చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, డిజిటల్ అరెస్టు అని పోలీస్, సీబీఐ అధికారుల పేరుతో భయపెట్టి డబ్బులు కాజేస్తారని హెచ్చరించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

గురుకులాలను సందర్శించిన కలెక్టర్