
వన మహోత్సవానికి సిద్ధం
● జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం
● పకడ్బందీగా చేపట్టేందుకు అధికారుల ప్రణాళికలు
● అటవీ, ఉపాధి హామీ, పురపాలిక శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కల పెంపకం
● జిల్లాలో 2,632 ప్లాంటేషన్ సైట్ల గుర్తింపు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో నర్సరీలు, మొక్కలు నాటే ప్లాంటేషన్ సైట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నర్సరీలు సిద్ధం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి తరచూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొక్కల పెరుగుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ, అటవీశాఖ, మున్సిపాలిటీల సిబ్బందికి సూచిస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఖాళీ స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమతమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.