
అత్యవసర సిబ్బందికి అందిన జీతాలు
● సాక్షి కథనానికి స్పందన
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో 108, 102 వాహనాల్లో పని చేస్తున్న పైలెట్, టెక్నికల్ సిబ్బందికి ఎంఆర్‌ఐ సంస్థ గురువారం సాయంత్రం జీతాలు అందజేసింది. గురువారం ‘సాక్షి’ ‘దినపత్రికలో అర్ధాకలితో అత్యవసర సిబ్బంది’ శీర్షికతో వచ్చిన కథనంపై విస్తృత ప్రచారం అయిన నేపథ్యంలో సంస్థ నిర్వాహకులు సిబ్బందికి సంబంధించిన జీతాలను వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న సిబ్బంది సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
గద్వాల: జిల్లాలోని బీచుపల్లి (బాలుర), మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని టీజీఆర్ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 8వ రగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్‌నగర్ డీఈఓ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సంబంధిత పాఠశాలల్లో స్వయంగా అందజేయాలన్నారు. దరఖాస్తుతోపాటు విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న బోనోఫైడ్, రెండు పాస్‌పోర్టు ఫొటోలు తప్పక జతపరచాలన్నారు. ప్రవేశ పరీక్ష 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీజీఆర్ స్కూల్ జూనియర్ కళాశాల బాలికల బాలానగర్‌లో నిర్వహించి సీట్లు కేటాయిస్తారన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 81069 63904, 99511 49909లను సంప్రదించాలని సూచించారు.
ఆలయ భూముల అన్యాక్రాంతంపై విచారణ
జడ్చర్ల టౌన్: జడ్చర్లలో లోకాయుక్త డీఎస్పీ విద్యాసాగర్ గురువారం పర్యటించారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని సామాజిక వేత్త అనిల్‌కుమార్, అయ్యన్న, తెలుగు సత్తయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త న్యాయమూర్తి విచారణకు ఆదేశించటంతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు భూములను పరిశీలించారు. భూముల వివరాలు తెలుసుకోవటంతో పాటు ఖాళీ స్థలాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విచారణ సమయంలో దేవాలయానికి సంబంధించిన నిర్వాహకులు అనారోగ్యం కారణంగా హజరు కాలేదని సిబ్బంది ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు ఆలయ భూముల గురించి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం డీఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ నివేదికను న్యాయమూర్తికి అందజేస్తానన్నారు. గతంలో జరిపిన విచారణ వివరాలు ప్రశ్నించగా ఆ సమయంలో ఆలయ భూములతోపాటు గాంధీనగర్ ట్రస్టుపై విచారణ చేశామని, రెండు నివేదికలు న్యాయమూర్తికి ఇవ్వాల్సి ఉందన్నారు. అన్యాక్రాంతం అయిన భూముల్లో శాశ్వత భవనాలు నిర్మించడంతో వాటిని ఏం చేస్తారని ప్రశ్నించగా తాను విచా రణ చేసి వాస్తవాలను న్యాయమూర్తికి అందించడమే తన పని, తదుపరి నిర్ణయం ఆయన తీసుకుంటారని వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్‌రావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వీణాధరి ఉన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.5,100
గద్వాల వ్యవసాయం/జడ్చర్ల: గద్వాల మార్కెట్‌కు గురువారం 226 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 5,100 కనిష్టంగా రూ. 2,711 ధర పలికింది. ఆముదాలు గరిష్టంగా రూ. 2,077, కనిష్టంగా రూ. 1,868, సరాసరి రూ. 2,077 ధరలు లభించాయి. బాదేపల్లి మార్కెట్‌లో మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,251, కనిష్టంగా రూ.1,769, ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,969 ధరలు పలికాయి.

అత్యవసర సిబ్బందికి అందిన జీతాలు