
జడ్చర్లలో డెంగీ కేసు నమోదు
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని వెంకటపతిరావు కాలనీలో నివాసుముంటున్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. పోలేపల్లి ఫార్మసెజ్‌లోని హెటిరో కంపెనీలో పనిచేస్తున్న పరశురాం అనే వ్యక్తికి బుధవారం డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే డెంగీ సోకినట్లు తెలియగానే బాధితుడు స్వగ్రామానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, అర్బన్‌హెల్త్ సెంటర్ వైద్యాధికారి డా.మనుప్రియలు బాధితుడు నివాసం ఉంటున్న ఇంటిని సందర్శించారు. మున్సిపల్ వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా యాంటి లార్వాల్, యాంటి మస్క్విటో నివారణ చర్యలు చేపట్టారు. పరిసరాల్లోని 100 ఇళ్లల్లోనూ అవగాహన కల్పించారు.బాధితుడి ఇంటితో పాటు పరిసరాల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లించి దోమల మందును ఫాగింగ్ చేయించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
దోమలపెంట: శ్రీశైలం భూగర్భ కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మిక సమస్యలను పరిష్కరించాలని జెన్‌కో 1535 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకర లవకుమార్ కోరారు. ఈ మేరకు గురువారం కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఆర్టిజన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వారిని దృష్టిలో ఉంచుకొని పనిఒత్తిడి తగ్గించాలని వివరించారు. రొటేషన్ పద్ధతిలో జనరల్‌లో విధులు నిర్వహిస్తున్నవారిని షిఫ్టుకు, షిఫ్టుకు వారిని జనరల్‌కు ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. జీఐఎస్ ప్రాంతంలో వాష్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని వివరించారు. జెన్‌కో కాలనీలో విద్యుత్తు ఉద్యోగుల నివాస కాలనీలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.