
‘నేరస్తులు ఎవరూ తప్పించుకోలేరు’
అయిజ: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో పోలీసుల నుంచి నేరస్తులెవరూ తప్పించుకోలేరని డీఎస్పీ మొగలయ్య అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించారు. అయిజ పట్టణానికి చెందిన సరోజ (40)కు ధరూరు మండలానికి చెందిన వడ్ల రామాచారితో 2001లో వివాహం అయ్యిందదని తెలిపారు. వారికి ఇద్దరు కుమారులు వినోద్, పవన్, కూతురు వైష్ణవి ఉన్నారన్నారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకున్నారని తెలిపారు. 2012లో రామాచారి రెండో వివాహం చేసుకున్నాడని, అప్పుడప్పుడు వచ్చి మెదటి భార్య ద్వారా కలిగిన సంతానాన్ని చూసి వెళ్లేవాడని పేర్కొన్నారు. అయితే మెదటి భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, దాంతో మొదటి కుమారుడికి ఎవరూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం లేదని రామాచారి భావించాడు. ఈ నెల 1 న అయిజకు చేరుకొని తన పెద్ద కొడుకు వినోద్‌తో కలిసి సరోజ ఇంట్లో ఒటరిగా ఉన్న సమయంలో గాయపరిచి ప్రాణాలు తీశారని వివరించారు. మృతురాలి తమ్ముడు వడ్ల నరసింహాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో సీఐ టాటా బాబు, ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.