
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్న పరీక్షల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొత్తం 9,069 మంది రాయనున్న ఆయా పరీక్షలకు గాను జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఐఈఓ కౌసర్ జహాన్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వృత్తి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
వృత్తి నైపుణ్యం పెంపు కోసం ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఈ నెల 13 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె జిల్లాకేంద్రంలోని జేపీఎన్‌ఈఎస్ భవనంలో ఇస్తున్న శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని స్థాయిలలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు తెరిచిన తర్వాత రెండు వారాల పాటు 1 నుంచి 10వ తరగతి వరకు వర్ణమాల, ఇంగ్లిష్ అక్షరాలు, పదాలు, గణిత భావనలపై పునశ్చరణ తరగతులు నిర్వహించి విద్యార్థులను సంసిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ, డీఈఓ ప్రవీణ్ కుమార్, ఏఎంఓ శ్రీనివాస్, ిసీఎంఓ బాలుయాదవ్ పాల్గొన్నారు.