మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్‌నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
వచ్చే నెల 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 17వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ గల యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇస్తారన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తారన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈ నెల 31 వరకు విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు కేంద్రంలో సంప్రదించాలని ఆయన కోరారు.
20న సార్వత్రిక సమ్మె
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీఎన్‌జీఓ భవన సమావేశ మందిరంలో సమ్మె వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. లేబర్ కోడ్‌లను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం అమలు కోసం కార్మికులు ఈ నెల 20న నిర్వహించే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీ యూ నాయకులు బాలు, దాసు, వెంకటేశ్, వెంకటస్వామి, రాము పాల్గొన్నారు.
ఉత్సాహంగా సబ్ జూనియర్ నెట్‌బాల్ సెలక్షన్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో మంగళవారం సబ్ జూనియర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వేర్వురుగా బాల, బాలికల నెట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జనగాంలో ఈనెల 15 నుంచి 18 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్లు ప్రతిభచాటాలని కోరారు. కార్యక్రమంలో ఖాజాఖాన్, అంజద్‌అలీ, షరీఫ్, షకీల్, అక్రం, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వివిధ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం గురువారం జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ నిర్మాణ్ ఆర్గనైజేషన్, మన్నాన్ ట్రేడర్స్ భవనంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులన్నారు.

మన్యంకొండలోవైభవంగా వసంతోత్సవం