బాలుడి భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలుడి భద్రతకు భరోసా

Mar 6 2025 12:19 AM | Updated on Mar 6 2025 12:17 AM

వనపర్తి: సవతి తల్లి వేధింపులతో పసి బాలుడి హృదయానికి గాయమైంది. పోలీసులు చిన్నారిని ప్రేమతో ఓదార్చారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ అక్కున చేర్చుకొని నీకు మేము ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు. వివరాలు.. పెబ్బేరు మండలం సూగూరుకికి చెందిన గొల్ల నరసింహా, వనిత దంపతులకు తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నాడు. వనిత అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. పెద్దల బలవంతంపై నరసింహా సమీప బంధువైన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొత్తలో లక్ష్మి ఆబాలుడిని బాగానే చూసుకునేది. కాలం గడిచేకొద్ది ఆ చిన్నారిని చీటికిమాటికీ చిత్రహింసలకు గురిచేసేది. నిప్పులో కాల్చిన సలాకితో అతడి తొడలపై వాతలు పెట్టింది. ఈ విషయాన్ని ఆచిన్నారి తండ్రికి చెప్పినా ఆమె అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. మంగళవారం సవతితల్లి అకారణంగా చితకబాదగా ఆవిషయాన్ని ఆ అబ్బాయి తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. అతడు బాలుడిని తీసుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. సవతి తల్లి పెట్టిన ఇబ్బందులు, హింసను రామచంద్రయ్య ఎస్పీకి వివరించారు. దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమైన బాలుడిని ఎస్పీ చేరదీసి అల్పహారాన్ని అందజేసి ఓదార్చారు. అనంతరం అతడితో సమాచారమంతా రాబట్టారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ జిల్లా అధికారి, జిల్లా బాలల పరిరక్షణాధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ల ద్వారా బాలుడు ఎదుర్కొన్న మనోవేదనను, చిత్రహింసల వివరాలను సేకరించాలని కోరారు. వారి నివేదిక ఆధారంగా నిందితురాలిపై పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. బాలుడిలో మనోధైర్యాన్ని కలిగించి ఏదైనా పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ తెలిపారు.

సవితి తల్లి వేధింపులు

పోలీసులను ఆశ్రయించిన చిన్నారి

అక్కున చేర్చుకున్న ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement