
విద్యార్థులతో మాట్లాడుతున్న అంజన్‌రావ్, అధికారులు
మన్ననూర్: బాలబాలికలు రాజ్యాంగం ద్వార సంక్రమించిన తమ హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యుడు అంజన్‌రావ్ సూచించారు. శుక్రవారం మన్ననూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల, గిరిజన ఆశ్రమ పాఠశాలను హక్కుల బృందం సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు కుశల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడంతో పాటూ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కష్టమైనప్పటికీ ఇష్టంతో చదివితే ఆశించిన ఉద్దేశంతో పాటూ అనుకున్న గోల్‌ను సాధించవచ్చని సూచించారు. అధిక మార్కులు సాధించడమే ప్రామాణికం కాదని, ప్రతిఒక్కరూ విద్యతో పాటూ నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు. పరిస్థితులను బట్టి విద్యార్థుల ఆరోగ్యంపై వీలైనంత జాగ్రత్తగా ఉండాలని పాఠాశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, సిబ్బందిని ఆదేశించారు. అంతకు ముందు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పెద్ద మొత్తంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం అన్నారు. పాఠశాల నిర్వాహకులతో పాటూ వార్డన్‌కు సహకరిస్తున్న జిల్లా అధికారులపై విచారణ చేసి, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా కలెక్టర్‌తో పాటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, కమిషన్ సభ్యులు ఎల్లప్ప, ప్రసన్న, లక్ష్మణ్‌రావ్, వెంకటేష్, శ్రీశైలం, సుదర్శన్, సాహితి తదితరులు పాల్గొన్నారు.