
సీపీఆర్ నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆకస్మిక గుండెపోటు వల్ల వ్యక్తులు మరణించకుండా రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించడం ఎంతో మంచి కార్యక్రమం అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో సీపీఆర్, ఏఈడీలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ తర్వాత వయసుతో నిమిత్తం లేకుండా ఆకస్మిక గుండెపోటు వల్ల అనేకమంది మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. గుండెపోటు వల్ల సంభవించే మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఆర్‌పై వైద్య, ఆరోగ్యసిబ్బందితో పాటు సామాన్య ప్రజలకు సైతం శిక్షణ ఇస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని.. ఎక్కడైనా, ఎవరికై నా గుండెపోటు వచ్చినప్పుడు వారిని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరారు. కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ సీపీఆర్ శిక్షణ వల్ల కనీసం 50 శాతం గుండెపోటు మరణాలను తగ్గించవచ్చని అన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే లోపు సీపీఆర్ చేస్తే బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. శిక్షణ తీసుకున్న వారు వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వాలని, తద్వారా వారు కూడా ఎక్కువ మందికి శిక్షణ ఇస్తే రాష్ట్రంలో గుండెపోటు మరణాలు కొంచైమెనా తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో అన్ని కార్యాలయాలు, భవన సముదాయాలు, దుకాణ సముదాయాలు, సినిమా హాళ్లు, తదితర చోట సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చే మాడ్యూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ భాస్కర్‌నాయక్, డెమో తిరుపతిరావు, సీపీఆర్ మాస్టర్ ట్రైనర్లు నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి