
అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆటో
మన్ననూర్: వంట చెరుకు తీసుకెళ్తున్న ఆటోను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన మన్ననూర్‌లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా మన్ననూర్ ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్ అటవీ ప్రాంతంలోని వెళ్తుండగా, అనుమతి లేకుండా అడవి నుంచి వంట చెరుకు తీసుకువస్తున్న ఆటో కనిపించింది. దీంతో లింగమయ్య చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న బేస్ క్యాంపు సిబ్బందికి సమాచారం ఇచ్చి అలర్ట్ చేశారు. అధికారి ఆదేశాల మేరకు ఆటోను నలుగురు బేస్‌కాంపు సిబ్బంది అడ్డుకున్నారు. విచారిస్తుండగా దాసరి మాసయ్య అనే వాచర్‌పై మహేష్ మరికొందరు దాడిచేసి గాయపరిచారు. దీంతో వాచర్‌ను ఆస్పత్రికి తరలించి ఆటోను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని అటవీశాఖ అధికారులు తెలిపారు.