
మన్యకొండ దేవస్థానం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న పర్వదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆ రోజు స్వామి వారిని దేవస్థానం ముందున్న రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి పవిత్ర కల్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. అనంతరం దేవస్థానంలోని లక్ష్మీ విలాసంలో రెండు రోజుల పాటు జరుగు అఖండ భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓబ్లాయిపల్లి, కోటకదిర గ్రామాలకు చెందిన భజన మండలి ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
31న పట్టాభిషేకం...
స్వామివారికి శ్రీరామనవమి ముగింపు సందర్భంగా ఈనెల 31న పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.అలాగే అదే రోజు స్వామివారికి నివేదన, ఆరగింపు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం వేడుకల ప్రత్యేక ప్రసాదం పానకాన్ని భక్తులకు అందజేయనున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. స్వామివారి కల్యాణ రుసుము రూ.1,000 ఉంటుందని, భక్తులు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి కల్యాణంలో పాల్గొనాలని కోరారు.
శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు
30న కల్యాణం.. 31న పట్టాభిషేకం