
యువకుల దాడిలో గాయపడిన క్రేన్ డ్రైవర్లు
● హోంగార్డుగా పనిచేస్తున్న తన కుమారుడు సుదర్శన్‌గౌడ్‌పై కొందరు యువకులు దాడి చేశారని తండ్రి ముదిరెడ్డిపల్లికి చెందిన నారాయణగౌడ్ చెప్పారు. తమకున్న రెండు క్రేన్‌లను సెజ్‌లోని పరిశ్రమల్లో అద్దెకు ఇస్తుంటాడని, అయితే శనివారం రాత్రి రాజాపూర్‌కు చెందిన యువకులు ఇసుక లోడ్‌తో వస్తున్న లారీకి ముదిరెడ్డిపల్లి వద్ద సెజ్‌లోకి వెళ్తున్న క్రేన్ సైడ్ ఇవ్వలేదని డ్రైవర్లపై దాడి చేశారన్నారు. ఈ విషయం తెలిసి తన కొడుకు సుదర్శన్‌గౌడ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. రాజాపూర్ చౌరస్తాలో అడ్డుకుని మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ దాడి చేసి రూ.70 వేల నగదును లాక్కున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి స్పందిస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమని వివరించారు.
రాజాపూర్: అసలే వారు చేసేది అక్రమ దందా.. ఆపై ఎవరైనా అడ్డు వస్తే దాడులు చేసే స్థాయికి ఎదిగిపోయారు ఇసుకాసురులు. తప్పు జరిగిందిలే మరోమారు సర్ది చెబుతాం అంటూ వారికి నచ్చజెప్పడంతో.. ఎవరేం చేయలేరు లే అంటూ రాజాపూర్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ముఖ్యంగా రాజాపూర్ శివారులోని దుందుభీ వాగులో ఉన్న ఇసుకను తోడేయడమే కాకుండా.. ఇసుక అయిపోవడంతో మట్టిని తీసి ఫిల్టర్ చేసి పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. మండలంలోని ముదిరెడ్డిపల్లి, నందిగామ, తిర్మలాపూర్, చెన్నవెల్లి, దోండ్లపల్లి తదితర గ్రామాల్లో ఈ దందా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే రాత్రివేళలో రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు అనుమతి లేని ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుని వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని లారీడ్రైవర్లను బెదిరించి మీరు చేసేది దొంగ దందా మాకు ట్రిప్పుకు మామూలు ఇవ్వాల్సిందేనంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
రాత్రి దాడులు.. పగలు రాజీలు
రాజాపూర్‌లో తరుచుగా ఇసుక అక్రమంగా లారీలో లోడ్ చేసుకుని వెళ్తున్న సమయంలో కొందరు యువకులు లారీలను ఆపి తమకు మామూలు ఇచ్చి వెళ్లాలని, లేకపోతే దాడులకు సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలో రాత్రివేళలో యువకుల చేతుల్లో దాడికి గురైన వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మనోళ్లే మరోసారి చేయకుండా చూద్దాం అంటూ రాజీ కుదుర్చుతుండటంతో దెబ్బలు తిన్నవారు సైతం మిన్నంకుండిపోతున్నారు.
దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్న కొందరు యువకులు
పైసలు ఇవ్వని, అడ్డుకునే వారిపై దాడులు
మనోళ్లే అంటూ వత్తాసు పలుకుతున్న స్థానిక నేతలు