
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రముఖ చిత్రకారులు శేష బ్రహ్మం ఏలూరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఈనెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్న కళాయజ్ఞం ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో జిల్లాకు చెందిన చిత్రకారుడు జేపీ మహేష్‌కుమార్‌కు అవకాశం లభించింది. ఈ సందర్భంగా మంగళవారం మహేష్‌కుమార్ మాట్లాడుతూ కళాయజ్ఞం సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ చిత్రకళా పోటీలు నిర్వహించగాను నేను వేసిన చిత్రం ఎంపికై ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడానికి అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు 143 చిత్రాల్లో నేను గీసిన చిత్రం ఒకటిగా ఎంపికై నట్లు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ కోసం చలో ఢిల్లీ
మహబూబ్‌నగర్ రూరల్: తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో అనేకమార్లు ఏకగ్రీవ తీర్మానం, ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూనే ఉన్నాయని ఎమ్మార్పీఎస్ –ఆర్‌ఆర్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈనెల 30, 31వ తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష, ధర్నాలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన మాటను చిత్తశుద్ధితో అమలు చేయాలని, అప్పుడే మాదిగ ఉప కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో మాజీ కౌన్సిలర్ ఎన్.బుర్రన్న, నాయకులు మల్లెల రాజశేఖర్, రాజగాని అశోక్, ఎల్.రమేష్, గడ్డమీది గోపాల్, తిరుమలయ్య, పాతూరి రమేష్, బొర్ర సురేష్, శ్రీను, కృష్ణ, దినేష్, పి.నగేష్, చెన్నయ్య, అనిల్‌కుమార్, మెట్టు అంజమ్మ ఉన్నారు.
