
సత్కారం అందుకున్న పాలకమండలి చైర్మన్, సభ్యులు
జోగుళాంబ శక్తిపీఠం: పదవీకాలంలో చేసిన పనులే శాశ్వత కీర్తి, గుర్తింపును ఇస్తాయని అలంపూర్ జోగుళాంబ ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ అన్నారు. పాలకమండలి పదవీకాలం ముగియడంతో సోమవారం దేవస్థానం పాలకమండలికి ఆలయం తరపున అభినందన సభ, ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఈఓ మాట్లాడుతూ ఏడాది పదవీకాలంలో పాలకమండలి దేవస్థానం వారికి పరిపాలన రంగంలో ఎంతగానో సహకరించారని కొనియాడారు. అమ్మవారి అనుగ్రహంతో వారికి మరోమారు పదవీయోగం కలగాని, కొత్త సంవత్సరంలో వారికి మంచి జరగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది మాట్లాడుతూ పాలకమండలి అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేశారన్నారు. చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తాను అమ్మవారికి సేవ చేయాలని తొలిరోజు చేసిన సంకల్పంలో, తన దీక్షలో ఎలాంటి లోపం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. అయితే పదవీకాలం చాలా తక్కువ ఉందని మరోమారు అవకాశం వస్తే అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామన్నారు. అనంతరం పాలకమండలి చైర్మన్‌తోపాటు సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.