
రొట్టెలు తయారు చేస్తున్న మహిళలు
గండేడ్: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చిన్న చిన్న యూనిట్లు మంజూరు చేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. మండల కేంద్రంలో రెండేళ్ల క్రితం రూర్బన్ పథకం కింద రూ.24.50 లక్షలతో మిల్లెట్ యూనిట్ ప్రారంభించారు. ఇందులో 9 రకాల యంత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చిరుధాన్యాలతో వివిధ రకాల తినుబండారాలు తయారుచేసి విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఉద్దేశం. మండలంలోని పలు గ్రామాల మహిళలతో కలిపి మహిళా ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేశారు. యూనిట్ నిర్వహణకుగాను ఒక్కో సంఘం నుంచి రూ.500 చొప్పున 403 సంఘాలతో మూలధనం సేకరించి కేంద్ర ప్రభుత్వ వాటాగా పంపించారు. జమైన మూలధనానికి సమానంగా కేంద్రం నుంచి రూ. 3.50 లక్షలు మంజూరయ్యాయి. వీటితో పాటు మహిళా సమాఖ్య నుంచి కొంత డబ్బు తీసుకొని యూనిట్ నిర్వహణకు వినియోగించారు. ఇందులో రొట్టెల తయారీ యూనిట్ రోజురోజుకు ఊపందుకుంది. మొదటి ఏడాది అంతంత మాత్రంగానే నడిచినా.. రానురాను జోరందుకుంది.
రోజుకు సుమారు రెండు వేలు..
మండల కేంద్రంలోని సమాఖ్య భవనంలో కొనసాగుతున్న రొట్టెల తయారీ యూనిట్‌లో ఒకప్పుడు 100 నుంచి 500 వరకు తయారు చేసేవారు. రానురాను వీటికి ఆదరణ పెరగడంతో నేడు ఆ సంఖ్య 1,500 నుంచి రెండు వేలకు చేరింది. రూ.5 ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. వీనిని సల్కర్‌పేట్, వెన్నాచేడ్, అంచన్‌పల్లి, గండేడ్ తదితర గ్రామాల్లోని హోటళ్లు, దాబాలు, కిరాణ దుకాణాలకు విక్రయంచడంతో పాటు మహమ్మదాబాద్, కోస్గి, హన్వాడ మండలాలకు కేంద్రం నుంచి నేరుగా సరఫరా చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఎక్కువ మొత్తంలో తయారు చేసేందుకు ఇటీవల పెద్దపెంక, పొయ్యిని కొనుగోలు చేశారు. మొదట ఒకేసారి 4 రొట్టెలు అవుతుండగా.. ప్రస్తుతం 8 తయారవుతున్నాయి. పిండి కలిపి మిషన్‌లో వేసి రొట్టెలు కట్ చేసి అనంతరం పెనంపై కాల్చి ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు.
కొనుగోలుదారుల ఆసక్తి
దాబాలు, దుకాణాల్లో పెరిగిన విక్రయాలు
ఉపాధి పొందుతున్న మహిళలు
రూ.250 చొప్పున..
యూనిట్‌లో ప్రస్తుతం ఆరుగురు మహిళలు పనిచేస్తుండగా.. ఒక్కొక్కరికి రోజుకు రూ.250 చెల్లిస్తున్నారు. దీనిని విస్తరిస్తే మరింత మందికి ఉపాధితో పాటు యూనిట్‌కు ఆదాయం కూడా పెరగనుంది.

ప్యాకింగ్ ఇలా..