
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. 32 పరీక్ష కేంద్రాల్లో 10,695 మంది పరీక్ష రాశారు. మొత్తం 11,107 మంది హాజరుకావాల్సి ఉండగా 412 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశారు.
టౌన్‌షిప్ ప్లాట్లకువిశేష స్పందన
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సారిక, పోతులమడుగు టౌన్ షిప్‌లలోని ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన బహిరంగ వేలానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో నిర్వహించిన వేలం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గురువారం నిర్వహించిన వేలానికి తక్కువ మంది వేలందారులు రాగా.. శుక్రవారం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా 40 ప్లాట్లు అమ్ముడుపోగా.. రూ.6.69 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శనివారం సైతం బహిరంగ వేలం కొనసాగుతుందని చెప్పారు. రూ.10 వేల డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. అనంతరం ప్లాట్లు దక్కించుకున్న వారికి కేటాయింపు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ భాస్కర్, ఎస్‌బీఐ అధికారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రత్యేక
బ్యాంకు లోక్ అదాలత్
పాలమూరు: బ్యాంకులలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం శనివారం ప్రత్యేక బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బ్యాంకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు నిర్వాహకులతో పాటు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి 779 కేసులలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
‘పాలమూరు’పైమాట తప్పిన కేసీఆర్
భూత్పూర్: పాలమూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని డీసీసీ అధ్యక్షుడు జి.మదుసుధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మండలంలోని కర్వెన, కొత్తూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. రూ.5 లక్షలకు ఇంటి నిర్మాణం, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కర్వెన ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో భూ నిర్వాసితులైన రైతులకు ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. కరీంనగర్‌లోని మల్లన్నసాగర్‌లో నిర్వాసితులకు ఎకరాకు రూ.13 లక్షల పరిహారం ఇస్తే.. కర్వెన నిర్వాసితులకు కేవలం రూ.3.50 లక్షలు మాత్రమే ఇచ్చారని, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎక్కువ పరిహారం ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పంటల బీమా సౌకర్యం, ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గోవర్ధన్‌గౌడ్, విజయ్‌గౌడ్, హర్యానాయక్, మాధవరెడ్డి, కొండయ్య, జగదీశ్వర్, తిరుపతి రెడ్డి, కాన్షీరాం తదితరులు పాల్గొన్నారు.

