
పంటల సాగులో మెలకువలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు పంటల సాగు సమయాల్లో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి (ఇన్‌చార్జ్) అజ్మీర శ్రీనివాసరావు అన్నారు. మహబూబా బాద్ మండలంలోని మల్యాల గ్రామంలోని సాగు చేస్తున్న పత్తి, కూరగాయల పంటలను శ్రీనివాసరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అంతర పంటల కృషి, కలుపు నివారణపై అవగాహన కల్పించారు. పంట మార్పిడి పద్ధతి అవలంభించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి మరియన్న, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓ బాలాజీ, రైతులు రవి, బానోతు పద్మ, బానోతు బాలకిషన్, భూక్య పద్మ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీఏఓ శ్రీనివాసరావు అన్నారు. మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డితో కలిసి మహబూబాబాద్‌లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా రైతు ఆధార్ కార్డు మీద మాత్రమే విక్రయించాలని, రైతులకు ఎమ్మార్పీ ధరకు మించి విక్రయించొద్దని డీలర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్స్ కలిగిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీఏఓ శ్రీనివాసరావు