
వణికిస్తున్న డెంగీ
జిల్లాలో నమోదైన మలేరియా, డెంగీ
కేసుల వివరాలు
సంవత్సరం మలేరియా డెంగీ
2022 20 125
2023 06 40
2024 11 419
2025 ఇప్పటి వరకు 03 18
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం జిల్లా ప్రజలను వణిస్తున్న డెంగీ జ్వరాలు ఈ ఏడాది కూడా వదలడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారణలో జిల్లాలో 18 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ డెంగీ కేసుల సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా. డెంగీ జ్వరానికి కారణమైన దోమలను పూర్తి స్థాయిలో నివారించకపోవడంతోనే కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డెంగీ జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చవుతుంది. కాగా.. ఈ జ్వరం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు భయపడుతున్నారు.
18కి చేరిన కేసులు..
ఈఏడాది ఇప్పటి వరకు 18 మందికి డెంగీ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మహబూబాబాద్ అర్బన్ పీహెచ్‌సీ పరిధిలో నాలుగు, మల్యాలలో మూడు, కురవిలో రెండు, నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, తీగలవేణి, అయోధ్యపురం, కోమట్లగూడెం పీహెచ్‌సీల్లో ఒకొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, తొర్రూరు పట్టణాల్లోని చికిత్స పొందుతున్న వారు వందకుపైగా ఉన్నట్లు అంచనా.
పట్టణాల్లోనే ఎక్కువ..
గతేడాది 419 డెంగీ కేసులు నమోదు కాగా.. ఇందులో మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గూడేలు, గిరిజన తండాలతో పోలిస్తే పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడమే అని వైద్యులు చెబుతున్నారు. మురికి కాల్వలు, చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల నివారణకు గంభోజీ చేపలు, ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి చర్యలు ఇప్పటి వరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడా మొదలు పెట్టలేదని ప్రజలు చెబుతున్నారు.
ముందుకు సాగని ప్రణాళిక
వర్షాకాలం రాకముందే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ.. నాలుగేళ్లుగా దోమ తెరలు రాలేదని గిరిజనులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడం బ్లీచింగ్, ఫాగింగ్ మొదలైన పనులకు నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరీ పనులు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పంచాయతీ, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టాలని కలెక్టర్ సమీక్ష సమావేశం పెట్టి ఆదేశించినా ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి.
అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాం. జ్వర సర్వే నిర్వహించి కేసులను గుర్తించి వైద్య సేవలందిస్తున్నాం. దోమల నివారణ కోసం వినియోగించే రసాయనాలను పీహెచ్‌సీలకు పంపించాం. ఆర్డీటీ కిట్లు అందజేశాం. అవసరమైన చోట హెల్త్ క్యాంపులు పెట్టి చికిత్సలు అందజేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– సుధీర్‌రెడ్డి, జిల్లా మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఇప్పటికి 16 మంది గుర్తింపు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వందల్లో కేసులు
ఇంకా మొదలుకాని ఫాగింగ్, దోమల నివారణ చర్యలు
భయపడుతున్న జిల్లా ప్రజలు

వణికిస్తున్న డెంగీ