
ఇక వినియోగంలోకి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లోని అన్‌యూజ్డ్ పోస్టులకు మోక్షం లభించింది. ఏళ్లుగా పక్కకు పెట్టిన ఆ పోస్టులు ఎట్టకేలకు ఇక వినియోగంలోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 216 అన్‌యూజ్డ్ పోస్టులతో పాటు ప్రస్తుతం అవసరం లేని 217 పోస్టులను రద్దు చేస్తూ అవసరమైన 339 పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏళ్లుగా వినియోగంలో లేని డీఎం గ్రేడ్–1, హెల్పర్ బెంచ్, గన్‌మాన్, టెలిఫోన్ బాయ్, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టూల్ కీపర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కమ్ మిక్సర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎస్‌ఎస్‌ఎ, ఎల్‌ఎండీ, జేఎల్‌ఎండీ, క్లీనర్, రోనియో ఆపరేటర్, లష్కర్ వంటి 216 పోస్టులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ కొత్త పోస్టులుగా పునరుద్ధరించారు. దీంతో కొత్తగా 2 చీఫ్ ఇంజనీర్, 1 జాయింట్ సెక్రటరీ, 4 సూపరిటెండెంట్ , 1 జనరల్ మేనేజర్, 4 డివిజనల్ ఇంజనీర్, 4 సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, , 6 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 1 అకౌంట్స్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్ , 4 పర్సనల్ ఆఫీసర్ , 16 సబ్ ఇంజనీర్, 16 అసిస్టెంట్ ఇంజనీర్, 20 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 32 సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, 88 సీనియర్ అసిస్టెంట్, 48 అసిస్టెంట్ లైన్‌మెన్, 80 ఆఫీస్ సబార్డినేట్, 4 వాచ్‌మెన్, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, 6 శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో అధికా రుల కొరత తీరనుంది.
పెరిగిన ఉన్నత స్థాయి పోస్టులతో పదోన్నతి..
ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో పదోన్నతి లభించనుంది. అన్ యూజ్డ్ పోస్టులను నూతన పోస్టులుగా సృష్టించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినప్పటి నుంచి చాలా మంది ఆశావహులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టిస్తూ అనుమతి ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిస్తోంది. సీజీఎం, ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పోస్టులకు అనుమతి వచ్చినా పదోన్నతి ప్రక్రియ అంశం కోర్టులో ఉంది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించడంతో కొంత కాలంగా ఈ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఏ క్షణాన స్టే ఎత్తివేసిన వెంటనే పదోన్నతి కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. నూతన పోస్టుల కోసం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి కృషి ఫలించిందని ఆయా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు తెలిపారు. అవసరమైన పోస్టులు పెరగడంతో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు.
ఎట్టకేలకు అన్‌యూజ్డ్ పోస్టులకు మోక్షం
339 ఉద్యోగాలు క్రియేట్ చేసి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో లభించనున్న పదోన్నతి
ఆశావహుల్లో వెల్లువెత్తిన సంతోషం..
తీరనున్న అధికారుల కొరత