
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
● పట్టించుకోని అధికారులు
● ఇబ్బందులు పడుతున్న రైతులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సీత్లాతండా గ్రామ శివారులో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. సుమారు రెండు నెలల క్రితం గాలిదుమారం, ఈదురుగాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయని రైతులు పేర్కొన్నారు. కాగా మండలంలోని ఉత్తరతండా గ్రామపంచాయతీ పరిధిలోని గుర్రాలగుట్టతండా నుంచి సీత్లాతండా గ్రామంలోని తుమ్మలకుంట చెరువు వరకు విద్యుత్ వైర్లు తెగిపడి ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తీగల వల్ల వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మరమ్మతుల కోసం 15 రోజుల క్రితం అధికారులు స్తంభాలు ఏర్పాటు చేసి వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు.