అడ్డుకుంటున్నది ఎవరు | - | Sakshi
Sakshi News home page

అడ్డుకుంటున్నది ఎవరు

Jul 2 2025 6:49 AM | Updated on Jul 2 2025 6:49 AM

అడ్డు

అడ్డుకుంటున్నది ఎవరు

టీజీ ఎన్పీడీసీఎల్‌లో నిలిచిన వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టుల బైఫర్‌కేషన్‌

హన్మకొండ: సాధారణంగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయంలో కచ్చితంగా వాచ్‌మెన్‌, స్వీపర్‌ను నియమిస్తారు. ఎందుకంటే ఆ కార్యాలయానికి సంబంధించి ఆస్తుల కాపలాకు వాచ్‌మెన్‌, నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి స్వీపర్‌ ఉంటారు. అయితే రాష్ట్రంలో రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఒక్కటైన టీజీ ఎన్పీడీసీఎల్‌లో మాత్రం ఆ పోస్టులను ఇంకా విభజన చేయడం లేదు. ఫలితంగా ఈ సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కార్యాలయాలకు కాపలా, పరిశుభ్రత కరువైంది. దీంతో అధికా రులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్‌మెన్‌, స్వీపర్‌ల విభజన కాకుండా తెర వెనుక ఎవరో అడ్డుకుంటున్నారని విద్యుత్‌ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఉద్యోగుల విభజన పూర్తి చేసి వీరిని బైఫర్‌కేషన్‌ చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెరిగిన సర్కిళ్లు..

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో పూర్వ వరంగల్‌ జిల్లా (సర్కిల్‌)లో నూతన సర్కిళ్లు, డివిజన్లు, ఈఆర్‌ఓలు, సబ్‌ డివిజన్లు, సెక్షన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలకు ఇంజనీర్లు, ప్రొవెన్షియల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందిని సర్దుబాటు చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్వీపర్‌, వాచ్‌మెన్‌ల బైఫర్‌కేషన్‌ను పట్టించుకోలేదు. ఫలితంగా వారు పాత కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, నూతనంగా ఏర్పాటైన కార్యాలయాల్లో వాచ్‌మెన్‌లు, స్వీపర్లు లేక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

డివిజన్ల వారీగా ఉద్యోగుల సర్దుబాటు..

నూతన కార్యాలయాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనకు 2018, జూన్‌లో సీజీఎం చైర్మన్‌గా ఎస్‌ఎఓగా కన్వీనర్‌, పూర్వ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఈలు సభ్యులుగా కమిటీని నియమించి సర్కిల్‌ స్థాయిలో ఉద్యోగుల విభజన చేశారు. అదే విధంగా సీజీఎం చైర్మన్‌గా, డీఈ టెక్నికల్‌ కన్వీనర్‌, ఎస్‌ఈలు సభ్యులుగా నియమించిన కమిటీ.. డివిజన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేసింది. కానీ స్వీపర్‌, వాచ్‌మెన్‌లను ముట్టు కోలేదు. పూర్వ ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలో ఇంజనీర్లు, ప్రొవెన్షియల్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌, లైన్‌మెన్‌ డ్రైవర్లను సర్దుబాటు చేశారు. కానీ ఒక్క పూర్వ వరంగల్‌ సర్కిల్‌లో స్వీపర్‌, వాచ్‌మెన్‌ లైన్‌మెన్‌ డ్రైవర్‌ పోస్టులను పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌లో సర్కిల్‌ స్థాయిలో స్వీపర్‌, వాచ్‌మెన్‌, లైన్‌మెన్‌ డ్రైవర్ల విభజన, సర్దుబాటుకు కమిటీ నియమించారు. అదే విధంగా డివిజన్‌ స్థాయిలో స్వీపర్‌, వాచ్‌మెన్‌, లైన్‌మెన్‌ డ్రైవర్‌ పోస్టుల విభజన, సర్దుబాటు కోసం మరో కమిటీని నియమించారు.

మూడేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం లేదు..

ఈ కమిటీలను నియమించి మూడేళ్లు గడిచాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్‌లుగా వ్యవహరించాల్సిన సీజీఎంలు మారినా, బదిలీల్లో ఎస్‌ఈలు, ఎస్‌ఏఓలు, డీఈ టెక్నికల్‌లు మారుతున్నారే కాని ఉద్యోగుల విభజన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడే ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం కూడా సీరియస్‌గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టుల విభజనను విస్మరించిన యాజమాన్యం..

వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టుల విభజనను యాజమాన్యం విస్మరించినట్లు కనిపిస్తోంది. పూర్వ వరంగల్‌ జిల్లా (సర్కిల్‌) పరిధిలో టీజీ ఎన్పీడీసీఎల్‌ నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్‌ ఆఫీస్‌ పూర్వ కార్యాలయంగా, నోడల్‌ కార్యాలయంగా పని చేస్తుండగా, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌తోపాటు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపి భూపాలపల్లి సర్కిళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డివిజన్‌ కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకు సబ్‌ ఇంజనీర్‌ స్థాయి నుంచి డివిజనల్‌ ఇంజనీర్‌ వరకు, జూనియర్‌ లైన్‌మెన్‌ నుంచి ఫోర్‌మెన్‌ వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ వరకు అధికారులు, ఉద్యోగుల బైఫర్‌కేషన్‌ చేసి పోస్టులు మంజూరు చేసి భర్తీ చేసిన యాజమాన్యం.. వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టులను విస్మరించిందని అధికారులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

అడ్డుకుంటున్నది ఎవరు1
1/1

అడ్డుకుంటున్నది ఎవరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement