
వినోదానికి వస్తూ విషాదం..
మరిపెడ రూరల్: సినిమా చూడడానికి ముగ్గురు మిత్రులు ఒకే బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో గేదెలను తప్పించపోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల గ్రామానికి చెందిన గజేంత్రి గణేశ్ (23), కుక్కల గణేశ్, బాల్ని గణేశ్ స్నేహితులు. సినిమా చూడడానికి ముగ్గురు ఒకే బైక్‌పై మరిపెడ మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద గేదెల మంద ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. వాటిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గజేంత్రి గణేశ్‌తోపాటు మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా గజేంత్రి గణేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గేదెలను తప్పించబోయి
అదుపు తప్పిన బైక్..
ఓ యువకుడు మృతి..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మరిపెడ మండలం గిరిపురం
క్రాస్ సమీపంలో ఘటన
సూర్యాపేట జిల్లా బిక్కుమళ్ల
గ్రామస్తులుగా గుర్తింపు