లోపాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ఎదిగి | - | Sakshi
Sakshi News home page

లోపాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ఎదిగి

Dec 3 2025 8:09 AM | Updated on Dec 3 2025 8:09 AM

లోపాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ఎదిగి

లోపాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ఎదిగి

● సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన డాక్టర్‌ గ్రేస్‌ సెలస్టియల్‌ ● అంగ వైకల్యాన్ని జయించి ఆదర్శంగా నిలిచిన వైనం

● సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన డాక్టర్‌ గ్రేస్‌ సెలస్టియల్‌ ● అంగ వైకల్యాన్ని జయించి ఆదర్శంగా నిలిచిన వైనం

డోన్‌: మనలోని లోపాన్ని తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. అదే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే నలుగురికి స్ఫూర్తినివ్వగలుగుతాం. ఇందుకు నంద్యాల జిల్లా డోన్‌ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు గ్రేస్‌ సెలస్టియల్‌ ఓ ఉదాహరణ. పుట్టిన ఆరునెలలకే పోలియో సోకి కాళ్లు సచ్చుబడిపోయినా సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హేళన, వివక్ష ఇవన్నీ ఆమె ఎదుగుదలను ఆపలేకపోయాయి.

పేద కుటుంబంలో పుట్టి.. సంకల్పం బలంతో రాణించి

కర్నూలు నగరానికి చెందిన జయరాజు, యేసు దైయమ్మ దంపతుల కుమార్తె డాక్టర్‌ గ్రేస్‌ సెలస్టియల్‌. వీరిది పేద కుటుంబమే. పుట్టిన ఆరునెలలకే సెలస్టియల్‌ పోలియో సోకితే తల్లిదండ్రులు కృంగిపోలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మంలో ఆస్ట్రేలియన్‌ మిషనరీ నేతృత్వంలో నిర్వహించబడుతున్న సెయింట్‌ మేరిస్‌ పోలియో హోమ్‌లో గ్రేస్‌ను చేర్పించారు. హోమ్‌ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న క్లారా హింటన్‌ అనే ఆస్ట్రేలియన్‌ మహిళ నేర్పించిన మెళకువలు, కల్పించిన మనోధైర్యం, ఆత్మస్థైర్యం గ్రేస్‌ భవిష్యత్తుకు బాటలు వేశాయి. ఆ తర్వాత పదవ తరగతి కర్నూలు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో, ఇంటర్‌ మీడియట్‌ కోల్స్‌ కళాశాలలో పూర్తిచేసింది. తర్వాత ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని బి.ఆర్‌.కె.ఆర్‌. మెడికల్‌ కళాశాలలో వైద్య విద్య అభ్యసించింది. రెండో ఏడాది చదువుతున్న దశలో ప్రాక్టికల్‌ కోసం ఎర్రగడ్డ నుంచి చార్మినార్‌ దగ్గర ఉన్న ఆసుపత్రి వరకు 15 కిలోమీటర్లు మూడుచక్రాల వాహనంపై ప్రయాణించి వైద్య విద్యను పూర్తిచేసింది. 2002వ సంవత్సరంలో మొట్టమొదట సాంఘిక సంక్షేమ శాఖలో ఆయుర్వేద వైద్యురాలిగా కరీంనగర్‌ జిల్లాలో విధులు నిర్వహించింది. 2004లో ఆయుష్‌ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో విజయనగరం జిల్లా అన్నంరాజు పేటలో విధులు నిర్వర్తించింది. 2006లో రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి సాధించిన గ్రేస్‌ ఆయుష్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా నియమించబడి పాణ్యం, డోన్‌లో విధులు నిర్వర్తించారు.

ఉత్తమ వైద్యురాలిగా ..

కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లా ఆయుష్‌ ఉన్నతాధికారిగా ఆమె రోగులకు అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు అందజేసింది. ప్రస్తుతం గ్రేస్‌ ఏపీ రాష్ట్ర దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం మహిళ విభాగం అధ్యక్షురాలిగానూ, జిల్లా అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గ్రేస్‌ సెలస్టియల్‌ను సాక్షి పలకరించగా ‘కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. జీవితం దేవుడు ఇచ్చిన వరం దీనిని ఆస్వాదించాలి. లోపాలు, వైఫల్యాలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించాల’ని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement