పత్తి దగ్ధం
హొళగుంద: మండల పరిఽధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా పత్తి దగ్ధమైంది. గ్రామానికి చెందిన మాల సిద్దప్ప అనే రైతు 30 క్వింటాళ్ల పత్తిని మంగళవారం ఇంటి బయట ఆరబెట్టాడు. మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా మంటలురేగి కాలిపోయింది. ఎవరైనా పత్తికి నిప్పు పెట్టారా లేక బీడీ తాగి అందులో పారవేశారా తెలియదు.ఈ ఘటనతో తనకు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు విచారించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.
మహిళా దొంగ అరెస్టు
కర్నూలు: కర్నూలు శివారులోని ధనలక్ష్మి నగర్‌లో నివాసముంటున్న దేవమ్మ మెడలో గొలుసు చోరీకి పాల్పడిన (చైన్ స్నాచింగ్) మహిళా దొంగ యాస్మిన్‌ను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. దేవమ్మ సోమవారం సమీప కాలనీలోని చౌక దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా బుర్ఖా ధరించిన ఓ మహిళ ఆమె మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించింది. ఆమె అప్రమత్తమై ప్రతిఘటించడంతో దుండగురాలు దాడి చేసి కత్తితో బెదిరించి మెడలోని గొలుసును తెంచుకుని పారిపోయింది. ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జొహరాపురానికి చెందిన యాస్మిన్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద తులం బంగారు గొలుసు, ఒక కత్తి, కత్తెర, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాస్మిన్ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. కుటుంబ పోషణ భారమై చోరీకి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు: మహిళపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ కర్నూలు ఎకై ్సజ్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గణేష్ నగర్‌కు చెందిన ఉప్పర లక్ష్మీదేవికి బ్యాంకు లోన్ ఇప్పిస్తానని అదే కాలనీకి చెందిన పిడతల లక్ష్మీదేవి, వెంకటస్వామి దంపతులు రూ.70 వేలు తీసుకున్నారు. లోన్ రాకపోవడంతో 2018 మే 23న ఉప్పర లక్ష్మిదేవి నిందితులను నిలదీసింది. వారు ఆగ్రహంతో దాడి చేసి దుర్భాషలాడారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో మొదటి నిందితురాలికి ఏడాది కారాగార శిక్ష, రూ.13 వేలు జరిమానా, రెండో నిందితునికి ఏడాది కారాగార శిక్ష, రూ.11 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు
మరో మృతదేహం లభ్యం
బండి ఆత్మకూరు : మండల పరిధిలోని సంతజూటూరు పికప్ ఆనకట్ట మంగళవారం మరో మృతదేహం (పురుషుడు )లభించింది. ఎస్‌ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు... మంగళవారం ఉదయం ఆనకట్ట వద్ద మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి చూడగా గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా సోమవారం ఇదే ఆనకట్ట వద్ద నుంచి బయటకు తీసిన మృతదేహం వెలుగోడు మండలంలోని రేగడగూడూరు గ్రామానికి చెందిన వడ్డే పెద్ద రామాయ్య (65)గా ఆయన బంధువులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృత దేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ జగన్మోహన్ తెలిపారు.


