పత్తి రైతు అవస్థలు
● నాణ్యత లేదని తిరస్కరిస్తున్న సీసీఐ ● చోద్యం చూస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు
నందవరం: ఆరు గాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు అధికారులు పట్టించుకోక..మరోవైపు ప్రభుత్వం స్పందించకపోవడంతో వారికి దిక్కుతోచడం లేదు. కనీసం సీసీఐకి పత్తి అమ్ముకుందామని తీసుకెళ్లితే నాణ్యత లేదని తిరస్కరిస్తున్నారు. మరి ఎందుకోసం ఈ కేంద్రం ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. మండల పరిధిలోని ముగతి గ్రామంలోని మురహరి జిన్నింగ్ మిల్లును సీసీఐ కొనుగోలు కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం ఇబ్రహీంపురం, నందవరం, ఎమ్మిగనూరు మండలాల చుట్టూ పక్కల గ్రామాల రైతులు వ్యయప్రయాసలుకూర్చి పత్తిని సీసీఐకి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక పత్తి నాణ్యత లేదని 8 లోడ్లను తిరస్కరించారు. దీంతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందారు. తేమశాతం 9 వచ్చిన పత్తి నాణ్యతగా లేదని తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ మంత్రి పత్తిలో 18 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలంటే సీసీఐ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా మార్కెటింగ్ అధికారులు స్పందించి పత్తి కొనుగోలు జరిగేలా చూడాలని వారు కోరతున్నారు.
పత్తి రైతు అవస్థలు


