
వాస్తవ సమాచారంతో పల్లెల పురోగతి
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వాస్తవ సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శనివారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అధికారులు, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ‘పంచాయతీ పురోగతి సూచిక’పై ఒక టీఓటీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డ్వామా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు వెంకటరమణయ్య, రమణారెడ్డి, పీ నిర్మల, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, వ్యవసాయ శాఖ ఏడీ సాలురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు గ్రామాల పురోగతిపై పూర్తి స్థాయి సమాచారం పంపాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, జల జీవన్ మిషన్ వంటి పథకాలు పూర్తి స్థాయిలో వినియోగించబడితే వీటి ప్రభావం ప్రజల ఆర్థికపరమైన, సామాజిక స్థాయిని పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మండల స్థాయిల్లో జరిగే శిక్షణా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత క్షేత్ర స్థాయిలో పంచాయతీ పురోగతి సూచిక వివరాలను పొందుపరచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్‌సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు ఆస్రఫ్ బాషా, పీ జగన్నాథం, కే జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి