
నల్లమలలో ‘అవినీతి’ అనకొండ
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ శాఖ కార్యాలయంలో 15 ఏళ్లుగా పని చేస్తూ ఐదు నెలల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగి అవినీతి బాగోతం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఏకంగా రూ.6కోట్ల నిధులను మళ్లించిన బాగోతం ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తోంది. నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పని చేసిన చాంద్ బాషా గతేడాది డిసెంబర్‌లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించిన సిబ్బందికి మొదట రూ.20 లక్షలు దారి మళ్లించినట్లు గుర్తించి దరాప్తు చేపట్టగా తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బైర్లూటీలోని ఎన్విరాన్‌మెంటల్ మెయింటెనెన్స్ చెక్ పోస్టు నుంచి వసూలైన మొత్తం సర్కిల్ కార్యాలయానికి జమ చేయకుండా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. ఈ విషయమై చాంద్ బాషాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖులు పోలీసులతో మధ్యవర్తిత్వం చేసి అరెస్టును వాయిదా వేయించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో దారి మళ్లిందనుకున్న రూ.20 లక్షలు ఆత్మకూరు ఎఫ్‌టీ డీడీ ఖాతాలో తిరిగి జమ చేశారు. ఆపై ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో చాంద్‌బాషా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత ఐదేళ్లలో అతని అక్రమాలు పరిశీలిస్తే దాదాపు రూ.6 కోట్లు దారి మళ్లించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌కు చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా, నాగార్జున సాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్‌కు చెందిన నంద్యాల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే గత ఐదేళ్లుగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం ప్రయివేట్ వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు వెలుగు చూసింది. అటవీశాఖకు చెందిన వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన నగదు మొత్తాలను చాంద్‌బాషా తెలివిగా తన సమీప బంధువులు, నమ్మకస్తుల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉండే మహేశ్వర ప్రింటింగ్ ప్రెస్ యజమాని శివయ్య, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు ఏకంగా సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు బదిలీ చర్చనీయాంశంగా మారింది.
కెమెరాల కొనుగోల్‌మాల్
నల్లమల అభయారణ్యంలో జంతువుల లెక్కింపు, వేటగాళ్ల కదలికలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలా కొనుగోళ్లలోను అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ టెలీ కమ్యూనికేషన్ సంస్థకు అటవీశాఖ ద్వారా ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు కొనుగోలుకు ఇండెంట్ పెట్టారు. అయితే అటవీ శాఖ అనకొండ కన్ను దీనిపై కూడా పడడంతో ఆ సంస్థకు కొంత కమీషన్ ఇచ్చి కెమెరాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్‌కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు.
సమగ్ర నివేదిక అందజేశాం
ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్‌బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది.
– వి.సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్
డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు
ఆత్మకూరు అటవీ కార్యాలయంలో ఫెవికాల్ ఉద్యోగి అక్రమాలు
పదవీ విరమణతో అవినీతి వెలుగులోకి
రూ.6 కోట్ల ప్రభుత్వ నిధులు
దారి మళ్లింపు

నల్లమలలో ‘అవినీతి’ అనకొండ

నల్లమలలో ‘అవినీతి’ అనకొండ