
కర్నూలులో భారీ వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులో శనివారం సాయంత్రం రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలో 46.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత లేకపోయినా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఉరుముల తీవ్రతకు చిన్నపిల్లలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆనంద్ సినీ కాంప్లెక్స్, కేసీ కెనాల్, రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులను చౌరస్తా మీదుగా బైపాస్‌కు మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
14 మండలాల్లో అకాల వర్షాలు
ఉరుములు, మెరుపులు.. గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుగ్గలిలో భారీ వర్షం కురిసింది. తుగ్గలిలో 45.2 మి.మీ, కోడుమూరులో 33.6, పత్తికొండలో 21.4, పెద్దకడుబూరులో 15.4, గోనెగండ్లలో 14.8, కోసిగిలో 9.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మామిడి తోటలకు నష్టం కలిగింది. రానున్న రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.