
చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే!
కర్నూలు(సెంట్రల్): రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ చేపట్టినవేనని సీఎం చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో రాయలసీమలో చాలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కల్లూరులోని తన నివాసంలో శనివారం కాటసాని విలేకరులతో మాట్లాడారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు ప్రధానమంత్రి ఉన్న సమయంలో పీవీ నరసింహారావు భూమి పూజ చేశారని తెలిపారు. 1994 ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాలువలను పూర్తి చేశారన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 2004లో సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్‌తో ప్రజలకు నీళ్లు ఇచ్చారన్నారు.
హాస్యాస్పదం
ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీ హయాంలో చేపట్టినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కాటసాని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చినట్లో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఎక్కడి నుంచైనా సందేశం ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆయన మాత్రం ఆ పనిమీదనే జిల్లా పర్యటనకు వచ్చారని, ఆయన రాకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఖర్చు వచ్చిందన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే ఆ జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు లేదా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి వస్తారన్నారు. చంద్రబాబు మాత్రం రైతు బజార్‌ను శుభ్రం చేయడానికి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సంక్షేమ పథకాలను ఎవరూ అడగకూడదని ఆగస్టు, జూన్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రాయలసీమలో ఒక్క సాగుప్రాజెక్టును
నిర్మించలేదు
గోరుకల్లును నిర్వర్యీం చేశారు
ఆయన పర్యటనతో
జిల్లాకు ఒరిగిందేమిటి?
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి