చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు | - | Sakshi
Sakshi News home page

చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు

May 11 2025 12:17 AM | Updated on May 11 2025 12:17 AM

చెరువ

చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు

‘వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేం. మిత్రులతో ఆటలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో గిల్లికజ్జాలు, అమ్మకు తోడుగా చిన్న చిన్న పనులు, చెరువులో ఈత.. ఇలా ఎన్నో సరదాలు. వేసవి సెలవులు ఒక్క రోజూ కూడా వృథా కాకుండా సద్వినియోగం చేసుకున్నాం’ అంటూ వెల్దుర్తి ఐసీడీఎస్‌ సీడీపీఓ పసుపుల లూక్‌ మనోహర్‌ చెబుతున్నారు. మిగతా వివరాలు ఆయన మాటల్లో..

వెల్దుర్తి: వేసవి సెలవులు వస్తే అమ్మకు సహాయం చేసేందుకు హాస్టల్‌ నుంచి పరిగెత్తుకు వచ్చేవాడిని. నాది కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం మహానంది పల్లె గ్రామం. మా అమ్మ లలిత, నాన్న జోజప్ప. మేము ఆరుగురు అన్నదమ్ములం, మాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నేను 5వ వాడిని. నాన్న టీచర్‌గా, అమ్మ గ్రామంలోనే శిశు విహార్‌లో టీచర్‌గా పని చేసేది. 9, 10వ తరగతులు రైల్వేకోడూరు మండలం బుక్కవానిపల్లెలోని ఏపీఆర్‌ఎస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకున్నాను. సెలవులు రాగానే ఇంటికి వెళ్లి అమ్మకు తోడుగా దూర ప్రాంతం నుంచి చేతిబోరు, చేదుడు బావుల నుంచి తాగునీరు తెచ్చేవాడిని. కొండల్లో కెళ్లి వంటకు కట్టెలు కొట్టుకొచ్చేవాడిని. శిశు విహార్‌లో పిల్లలకు రైమ్స్‌, చదువు నేర్పేవాడిని. అమ్మ గ్రామంలోను, చుట్టు పక్కల గ్రామాలకు నర్సు సేవలకు వెళ్లినపుడు నేనే శిశువిహార్‌ను చూసుకుంటూ ఆయాతో కలిసి చిన్నారులకు వడియాలు, పిండి పంచడం తదితరాలు చూసుకునేవాడిని.

చేపలు కాల్చుకుని తినేవాళ్లం..

మా గ్రామం ఆనుకుని ఉన్న పెండ్లిమర్రి చెరువు ఎండాకాలం సెలవులకు వెళ్లేటప్పటికి కొంత ఎండిపోయేది. ఇక ఫ్రెండ్స్‌తో కలిసి కొద్దిపాటి నీటిలో ఈత నేర్చుకున్నాను. ఈత కొడుతూ, చేపలు పడుతూ, ఆ చేపలు అక్కడే కాల్చుకు తింటూ, ఇంటికి తెచ్చి వండుకుంటూ భలే మజా వచ్చేది. హాస్టల్‌లో ఎక్కువగా ఆడే బలపం ఊదే ఆట (బలపాన్ని ఫస్టు ఎవరు లైన్‌వరకు ఊదుతారో వారికి ఓడిన వాళ్లు తెచ్చుకున్న సజ్జరొట్టె ముక్క ఇచ్చేలా ఆడేవాళ్లం)ను సెలవులకు ఇంటికి వచ్చి అన్నదమ్ములు, అక్కచెళ్లెల్లతో, ప్రెండ్స్‌తో ఆడేవాడిని. స్వాతంత్య్రానికి పూర్వమే మా ఊర్లో మా ముత్తాత వారు స్కూలు కట్టించి, ప్రైవేట్‌ టీచర్‌తో చదువు చెప్పించేవారు. తర్వాత బ్రిటీష్‌ వారు మా స్కూల్‌ను తీసుకుని మా కుటుంబానికి ఒక టీచర్‌ పోస్టు ఇచ్చి రోమన్‌ కాథలిక్‌ మిషన్‌ పేరుతో నడిపారు. అందులోనే నేను 3వ తరగతి వరకు చదువుకున్నాను. పీజీ పూర్తి చేసుకుని మహబూబ్‌నగర్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఉన్న ఐకేపీలో ఉద్యోగం చేస్తూ, ఆ తర్వాత ఐసీడీఎస్‌లో సీడీపీఓగా నా 27వ ఏట ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నాకు 51 ఏళ్లు. బాల్యం జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయమే.

మూడు రోజుల్లో సైకిల్‌ నేర్చుకున్నా..

చిన్నతనం సెలవుల్లోనే మూడు రోజుల్లో సైకిల్‌ నేర్చుకున్నాను. 8వ తరగతి వేసవి సెలవుల్లో ఆ సైకిల్‌ నేర్పుతోనే 3 కి.మీలు అవతల ఉండే కలసపాడుకు వెళ్లి ట్యూషన్‌ చెప్పించుకుని వచ్చి ఏపీఆర్‌ఎస్‌ 9వ తరగతి ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సంపాదించి సీటు సంపాదించాను. ఇక కట్టెలు తెచ్చేందుకు కొండల్లో కెళ్లినపుడు కుటుంబ సభ్యులం, ఫ్రెండ్స్‌ అంతా రేగిపండ్లు, బలిజ(పరికె) పండ్లు, చిటిమిటి పండ్లు తెంపుకుని ఇష్టంగా తినేవాళ్లం. ఎక్కువగా గ్రామంలోని ఫ్రెండ్స్‌తో ఖోఖో ఆడేవాళ్లం. అప్పుడప్పుడు గోళీకాయలు ఆడేవాళ్లం.

చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు 1
1/1

చెరువులో చేపలు.. అడవిలో చిటిమిటి పండ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement